నాన్న.. ప్రతీ బిడ్డను వెంటాడే ఓ ఎమోషన్‌

Father is a Hunting Emotion Happy Fathers Day Special Story  - Sakshi

ఈ ఆదివారం...  నాన్నకు ప్రేమతో...  

కని పెంచేది అమ్మ. అవసరాలను తీర్చేది నాన్న. నడకలో ప్రతీ అడుగు ముందుండే వ్యక్తి నాన్నే. నాన్నంటే ప్రతీ బిడ్డకు తప్పు చేస్తే దండిస్తాడనే ఒక భయం. కానీ, ఎలాంటి ఆపదలోనైనా అండగా ఉండే ధైర్యం కూడా. స్వార్థం లేని తల్లిదండ్రుల ప్రేమకు.. ప్రతీరోజూ రుణం తీర్చుకున్నా తప్పులేదు. కానీ, ప్రత్యేకంగా ఒకరోజు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో జూన్‌ మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్‌ డే’గా జరుపుతున్నారు. అలా ఈ జూన్‌ 20 ‘నాన్నకు ప్రేమతో..’ అంకితమైంది. 

యూరప్‌ నుంచి
యూరోపియన్‌, అమెరికన్‌ చర్చి సంస్కృతుల్లో పూర్వీకులకు గౌరవించుకోవడమనే సంప్రదాయం ఉండేది. ఇందుకోసం మధ్యయుగకాలంలో సెయింట్‌ జోసెఫ్‌స్‌ డే(మార్చి 19న) నిర్వహించేవాళ్లు. ప్రపంచంలో మదర్స్‌ డే సంబురాలు మొదలయ్యాక. తండ్రులకు అలాంటి ఒకరోజు ఉండాలనే ఆలోచన నుంచి ఫాదర్స్‌డే పుట్టింది. దీనివెనకాల ఓ కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫాదర్స్‌ డే కథ.. అమెరికా నుంచి పుట్టిందనే కథనం ఒకటి వినిపిస్తుంటుంది. 

సేవలకు గుర్తింపుగా
సొనోరా స్మార్ట్‌ డొడ్డ్‌ అనే యువతి తన తండ్రి సేవలకు గుర్తింపుగా.. ఆయన పుట్టినరోజును ఫాదర్స్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆ అమ్మాయి టీనేజీలో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. సోనొరా తండ్రి విలియం జాక్సన్‌ స్మార్ట్‌ మిలిటరీలో పని చేస్తాడు. తల్లిని పొగొట్టుకున్న సొనోరా, తండ్రి జాక్సన్‌తో కలిసి ఐదుగురు తమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తుంది. తమ కోసం సుఖాలు త్యాగం చేసిన ఆ తండ్రిని సొనోరా సన్మానించి గౌరవిస్తుంది. తండ్రి పడ్డ శ్రమకు గుర్తుగా ఆమె.. ఆయన పుట్టినరోజు జూన్‌5ను ఫాదర్స్‌ డేగా సెలబ్రేట్‌ చేసుకుంది. అలా ఒక తండ్రి త్యాగానికి బిడ్డ ఇచ్చిన గౌరవాన్ని ప్రపంచం మెచ్చుకుంది. తండ్రికి గౌరవంగా ఒకరోజు ఉంటే తప్పులేదని అంగీకరించింది. 

మూడో ఆదివారం
అప్పటికే అమెరికాలో అమలులో ఉన్న జులై 5వ తేదీని.. ముందుకు జరిపింది. అలా జూన్‌ 5న ఫాదర్స్‌ డే మొదలైంది. చివరకు 1972లో ప్రెసిడెంట్‌ నిక్సన్‌.. ఏటా జూన్‌ మాసంలో మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్‌ డే’గా ప్రకటిస్తూ అధికార పత్రంపై సంతకం చేశాడు. 111 దేశాలు పాటిస్తున్న ఈ రోజును అనధికారికంగానే ఫాదర్స్‌ డేగా నిర్వహించుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సంవత్సరంలో.. వేర్వేరు రోజుల్లో ఫాదర్స్‌ డేను జరుపుతున్నాయి. రష్యా, బెలారుస్‌లు ఫిబ్రవరి 23న ఫాదర్స్‌ డే గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి.

అక్కడ మాత్రం
ఇక ఒక సంవత్సరం చివర్లో ఫాదర్స్‌ డేను నిర్వహించేది బల్గేరియా(డిసెంబర్‌ 26). మనతో సహా చాలావరకు దేశాలు మాత్రం జూన్‌ మూడో ఆదివారంరోజునే ఫాదర్స్‌ డేగా స్వీకరించాయి. కొన్ని దేశాల్లో ఫాదర్స్‌ డే సెలవు రోజుకాగా.. మరికొన్ని దేశాల్లో అప్రకటిత సెలవుగా కొనసాగుతోంది.   

ఏమివ్వగలం ?
నిరంతర శ్రామికుడిగా పేరున్న తండ్రికి.. ఆయన్ని గౌరవించుకునే రోజున ఏం ఇవ్వగలం? వాట్సాప్‌లో స్టేటస్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫొటో, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌తోనో, కాస్ట్‌లీ గిఫ్ట్‌లతో సంతోషపెట్టగలమేమో. కానీ, ఆ నిస్వార్థమైన ప్రేమను మాత్రం వెలకట్టలేం. అందుకే ఆ తండ్రి స్పర్శను.. అపారమైన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుదాం.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top