అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్‌? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి? | Expert Explains: How Iran’s response upset US-Israeli calculations | Sakshi
Sakshi News home page

అమెరికా అంచనాలు ఎలా తప్పాయ్‌? గల్ఫ్ భవిష్యత్తు ఏంటి?

Mar 15 2026 9:33 PM | Updated on Mar 15 2026 9:37 PM

Expert Explains: How Iran’s response upset US-Israeli calculations

ఇరాన్‌ తమకు లొంగిపోతుందని అమెరికా అనుకుంది. ఇరాన్‌ వద్ద ఆయుధాలు లేకుండా చేస్తే తమకు ఏ ముప్పూ ఉండబోదని ఇజ్రాయెల్‌ భావించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించాయి. అయితే, ఊహించని విధంగా ఇరాన్‌ ఎదురు నిలుస్తోంది. ప్రతీకారదాడులతో విరుచుకుపడుతోంది.  ఇరాన్ ప్రతిస్పందన అమెరికా-ఇజ్రాయెల్ అంచనాలను ఎలా తారుమారు చేసింది? ఇరాన్‌ దాడులు, ఇజ్రాయెల్‌ తీరుతో  గల్ఫ్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

అమెరికా ప్రకటించిన అంచనాలు, లక్ష్యాల ప్రకారం ఇరాన్‌పై సైనిక చర్యలు ఇప్పటికే ముగిసి, ఇజ్రాయెల్-అమెరికా విజయం సాధించాల్సింది. ఇరాన్‌లో పాలనావ్యవస్థ ఇప్పటికే కూలిపోవాలి. అణు మౌలిక వసతులు మళ్లీ ఎప్పటికీ కోలుకోలేని విధంగా ధ్వంసం కావాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్ర నాయకులను లేకుండా చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించిన సమయంలోనే అసాధ్యమైన పనిని సాధించినట్టు చాలామంది భావించారు. వారి అంచనాల ప్రకారం ఇది ముయామ్మర్ గడాఫీ, సద్దాం హుస్సేన్ పట్టుబడిన ఘటనలకన్నా పెద్ద విజయం.

ఊహించని విధంగా ఇరాన్‌ పోరాటం 
అయితే, కొన్ని గంటల్లోనే వందల సంఖ్యలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ లక్ష్యాలు, సమీప గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై దాడి చేశాయి. వాటిలో అధిక శాతం క్షిపణులు లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్, అమెరికా ముందుగానే ఇలాంటి సైనిక ఘర్షణను ఊహించి ఉండొచ్చు. కానీ, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఆస్తులను లక్ష్యాలుగా ప్రకటించడంతో ఇరాన్ ఈ చర్యను సంప్రదాయ ఆపరేషన్ నుంచి అస్థిరత సృష్టించే ప్రాంతీయ యుద్ధంగా మార్చింది. 

గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వలేదు. గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలు ఆయా దేశాలకు ప్రమాదంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ చర్చలు జరపాలంటే గల్ఫ్ దేశాల నుంచి అమెరికా స్థావరాలు తొలగించాలని ఇరాన్ షరతు పెట్టింది.

మరింత ఆయుధీకరణ వైపు ఇరాన్‌? 
యుద్ధం ప్రారంభమైన 2 వారాల్లోనే ఒక విషయం స్పష్టమైంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇరాన్‌ను మరింత ఆయుధీకరణ వైపు నడిపించనున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ సహజ వనరులను ఆయుధంగా వినియోగించే అవకాశమూ ఉంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌ ఓ ఆయుధంగా వాడుతోంది. అంటే గల్ఫ్ ప్రాంత సముద్రం నుంచి ప్రపంచానికి చమురు సరఫరా వెళ్లే కీలక సముద్ర మార్గంలో ఆటంకాలు కల్పిస్తోంది.

చూస్తుంటే ఇప్పట్లో ఇరాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమాసియా భద్రత, స్థిరత్వం మాత్రమే కాదు ప్రపంచ ఇంధన సరఫరా కూడా ప్రభావితమైంది. ఇరాన్‌లో పాలనా మార్పు, అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రజలకు ఇజ్రాయెల్, అమెరికా వాగ్దానాలు చేశాయి. ఆ లక్ష్యాలు ఎన్నటికి నెరవేరతాయో ఎవరూ చెప్పలేరు. 

ఇప్పట్లో ముగిసే యుద్ధం కాదిది! 
కొందరు ఇజ్రాయెల్ నేతలు ఇరాన్‌పై భూతలంలో భీకర దాడులు చేయాలని భావిస్తున్నారు. అమెరికా నేతల్లో అసహనం పెరుగుతోంది. “షాక్ అండ్ ఆ” వ్యూహం ప్రకారం యుద్ధం ముగియదని విశ్లేషకులు చెబుతున్నారు. షాక్ అండ్ ఆ వ్యూహం అంటే శత్రువును ఒక్కసారిగా భారీ సైనిక దాడులతో మానసికంగా కుదేలు చేయడం.

యుద్ధ లక్ష్యాలు సమయ పరిమితితో ఉంటాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకూడదని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ లక్ష్యానికి అంతర్జాతీయ మద్దతు ఉంది. ఇరాన్ పొరుగు దేశాలు, టర్కీ, రష్యా, చైనా కూడా దీనికి ఒప్పుకున్నాయి. ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఇరాన్‌ను అణ్వాయుధ ప్రోగ్రాం  కొనసాగించకుండా నిరోధించింది. 

అదే సమయంలో 2015లో జరిగిన  జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకు సంబంధించిన ఒప్పందానికి అంగీకరించేందుకు కారణమైంది. ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం.

ఇరాన్ మతపరమైన వాదనను కూడా వినిపిస్తుంది. అణ్వాయుధ తయారీ ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని చెబుతుంది. అయితే యురేనియం శుద్ధి స్థాయి పెరుగుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇరాన్ తెలిపిన వివరాల ప్రకారం తన అణు విద్యుత్ కార్యక్రమం హక్కును గుర్తిస్తేనే యరేనియం శుద్ధిని ఆపుతామని చెబుతోంది. అణు విద్యుత్ కార్యక్రమాన్ని విదేశాలకు మార్చాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. భారతదేశం సహా అనేక దేశాలు ఇరాన్‌కు అణు విద్యుత్ కార్యక్రమం నిర్వహించే హక్కు ఉందని గుర్తించాయి.

అయితే ఇజ్రాయెల్ దృక్కోణం పూర్తిగా వేరేలా ఉంది. ఇరాన్ ను పూర్తిగా అణు నిరాయుధీకరణ చేయాలని, భవిష్యత్తులో ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఆయుధాలు కూడా ఆ దేశం వద్ద​ ఉండొద్దని కోరుతోంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.

ఈ యుద్ధంలో ఇరాన్ ఒక అంశంలో విజయవంతమైంది. ఇజ్రాయెల్ సైనిక శక్తి కేవలం ఇరాన్‌కే కాక గల్ఫ్ దేశాలకు కూడా ముప్పుగా మారవచ్చని గల్ఫ్ దేశాలను నమ్మించింది.

గల్ఫ్‌పై ప్రభావం
గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినప్పటికీ ఆయా దేశాలు శాంతియుత వైఖరితో ఉన్నాయి. అమెరికా సెనేటర్ లిన్డే గ్రాహం సహా పలువురు నాయకులు సౌదీ అరేబియాను యుద్ధంలో చేరాలని కోరారు. కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో ఘర్షణను పెట్టుకోలేదు. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు గల్ఫ్ ప్రజల్లో మద్దతు కనిపించలేదు. 

అయితే, గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్ భద్రతకు కవచంగా ఉపయోగిస్తున్నారని చాలా మందిలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రాంతీయ నాయకులు కూడా గల్ఫ్ భద్రతను పట్టించుకోలేదని విమర్శించారు. 2023లో జరిగిన సౌదీ అరేబియా-ఇరాన్‌ సయోధ్య తర్వాత ఇజ్రాయెల్‌ కఠిన విధానాలకు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్-గల్ఫ్ భద్రతా వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించిన అబ్రహం ఒప్పందాలు ఇప్పుడు అమలులో లేవు. సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రాంతీయ భద్రతా వ్యవస్థపై దృష్టి పెట్టాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement