ఈజిప్టు తీరంలో విషాదం.. కొట్టుకొచ్చిన 12 మంది మృతదేహాలు | Egypt recovers 12 migrants dead bodies mediterranean coast | Sakshi
Sakshi News home page

ఈజిప్టు తీరంలో విషాదం.. కొట్టుకొచ్చిన 12 మంది మృతదేహాలు

May 15 2026 1:58 AM | Updated on May 15 2026 2:05 AM

Egypt recovers 12 migrants dead bodies mediterranean coast

కైరో: ఈజిప్టు వాయువ్య మధ్యధరా తీరంలో విషాదం వెలుగు చూసింది. సిడి బరానీ నగర సమీపంలోని అబు గలీలా బీచ్‌లో 12 మంది అనుమానిత అక్రమ వలసదారుల మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక సమాచారం ప్రకారం.. సముద్రపు అలల తాకిడికి మృతదేహాలతో పాటు ఒక చెక్క పడవకు సంబంధించిన శిథిలాలు కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటిని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గురైన పడవ ద్వారా వీరు ప్రయాణిస్తూ ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే మాట్రౌహ్ అంబులెన్స్ అథారిటీ రంగంలోకి దిగింది. మార్సా మాట్రౌహ్ నగరం నుండి పశ్చిమాన సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి అత్యవసర వాహనాలను పంపారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాలను పోస్ట్‌మార్టం, తదుపరి ప్రక్రియ కోసం మాత్రౌహ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

లభ్యమైన మృతదేహాలన్నీ బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. దీనివల్ల బాధితుల వయస్సును, వారి వివరాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. మృతదేహాలు గుర్తించలేనంతగా పాడైపోవడంతో, బాధితులను గుర్తించేందుకు అధికారులు డీఎన్‌ఏ నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. సముద్రంలో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందన్న ఆందోళనతో తీరప్రాంతం వెంబడి అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

మధ్యధరా సముద్రం గుండా ఐరోపా దేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో అక్రమ వలసదారులు తరచూ ఇలాంటి ప్రమాదాల బారిన పడుతుండటం విషాదకరం.

Advertisement
 
Advertisement
Advertisement