పాక్‌లో ఘోర రైలు ప్రమాదం

Dozens killed in train crash in southern Pakistan - Sakshi

రెండు రైళ్లు ఢీకొని 50 మంది మృత్యువాత

మరో 100 మందికిపైగా గాయాలు

సింధ్‌ ప్రావిన్స్‌లో ఘటన

కరాచీ: పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సింధ్‌ ప్రావిన్సులో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మంది చనిపోగా మరో 70 మంది గాయాలపాలయ్యారు. పాక్‌ ఆర్మీ, పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగి, సహాయ, రక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. బోగీల్లో మరికొందరు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరిగేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.సోమవారం ఉదయం కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు పట్టాలు తప్పి, ఎదురుగా ఉన్న పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఎదురుగా రావల్పిండి నుంచి కరాచీ వైపు వస్తున్న సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వాటిని ఢీకొట్టింది. ఘోట్కి జిల్లా ధార్కి సమీపంలో జరిగిన ఈ ఘటనలో 50 మంది మరణించారని స్థానిక మీడియా పేర్కొంది.

ప్రమాద సమయంలో రైలు సాధారణ వేగంతోనే వెళుతోందని, చూస్తుండగానే మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు దొర్లుకుంటూ పట్టాలపైకి రావడం, వాటిని ఢీకొట్టడం క్షణాల్లోనూ జరిగిపోయిందని ఈ ప్రమాదం నుంచి బయటపడిన సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు డ్రైవర్‌ అయిజాజ్‌ షా తెలిపారు. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉండగా,  ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి వెయ్యి మంది వరకు ప్రయాణికులున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా ఇందులో 6 నుంచి 8 వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. బోగీల్లోపల చిక్కుకున్న వారిని వెలుపలికి తీయడానికి భారీ యంత్ర సామగ్రిని రప్పిస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం
రైలు ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ ఆల్వి, ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రమాద బాధితులకు సాయం అందించడంతోపాటు ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాను’అని ఇమ్రాన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు అందజేస్తామని యంత్రాంగం ప్రకటించిందని జియో న్యూస్‌ వెల్లడించింది. పాక్‌లో తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలకు కాలం చెల్లిన వ్యవస్థ, అవినీతి, నిర్వహణాలోపమే కారణమని రైల్వే మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దేశ విభజనకు ముందు కాలం నాటి రైల్వే వ్యవస్థ, పట్టాలనే ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top