ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు.. అమెరికా సంచలన ఆరోపణలు

Doubts Over Wagner Chief Yevgeny Prigozhin Death And Plane Crash - Sakshi

వాషింగ్‌టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు.

మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు.  

ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్‌       

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top