అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధం.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald Trump Says US May Be Banning TikTok App - Sakshi

న్యూయార్క్‌:  జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధించే దిశగా తన యంత్రాంగం పరిశీలన చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అయితే అదే సమయంలో టిక్‌టాక్‌ను నిషేధించాల్సి వస్తే అందుకు ప్రత్యామ్నాయాన్ని కూడా కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు వెల్లడించారు. కాగా టిక్‌టాక్‌ యూఎస్‌ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలు, హక్కులు సొంతం చేసుకునేందుకు దాని‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో, అమెరికా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్న క్రమంలో ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు విషయంలో  మైక్రోసాఫ్ట్‌ యాజమాన్యం ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు.

ఇక టిక్‌టాక్‌ మాత్రం.. ‘‘మేము అసత్య వార్తలు, ఊహాగానాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయము. మాకు టిక్‌టాక్‌ దీర్ఘకాలిక విజయంపై నమ్మకం ఉంది’ అని తెలిపింది. కాగా గతకొన్ని రోజులుగా అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా కంపెనీలు డ్రాగన్‌ ప్రభుత్వానికి తమ డేటాను చేరవేస్తున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్‌ యాప్‌లు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అగ్రరాజ్యం ఉపక్రమించింది. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్‌ టిక్‌టాక్‌ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రచురించింది. ఇందుకు సంబంధించిన చర్చలు సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, బిలియన్‌ డాలర్లతో కూడిన ఒప్పందం గురించి మైక్రోసాఫ్ట్‌ శ్వేతసౌధంతో కూడా సంప్రదింపులు జరిపినట్లు పేర్కొనడం.. బిజినెస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. (ఐరాసలో ఈసారి ట్రంప్‌ ఒక్కరే)

కాగా యూఎస్ జాతీయ-భద్రతా అధికారులు మ్యూజికల్.లై కొనుగోలును సమీక్షిస్తున్నారన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఆమెరికా సాయుధ దళాలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన ఫోన్స్‌లో టిక్ టాక్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశించారు. టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని అమెరికా పరిశీలిస్తోందని విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో జూలై నెల ప్రారంభంలో పేర్కొన్న విషయం తెలిసిందే. (ట్రంప్‌ బాధ్యతారాహిత్యం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top