డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట | Donald Trump Gains Temporary Relief on Global Tariffs | Sakshi
Sakshi News home page

డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట

Jun 12 2026 9:01 AM | Updated on Jun 12 2026 10:06 AM

Donald Trump Gains Temporary Relief on Global Tariffs

వాషింగ్టన్‌: ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న అమెరికా 10 శాతం గ్లోబల్‌ టారిఫ్‌ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ సుంకాలను నిలిపివేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే విధించిన స్టేను అమెరికా ఫెడరల్‌ అప్పీళ్ల కోర్టు తాజాగా పొడిగించింది. దీంతో కేసుపై తుది విచారణ పూర్తయ్యే వరకు ఈ టారిఫ్‌లు అమల్లోనే ఉండనున్నాయి.

అమెరికాలోని ఫెడరల్‌ సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ట్రంప్‌ ప్రభుత్వం ముగ్గురు దిగుమతిదారుల నుంచి 10 శాతం సుంకాలను వసూలు చేయడం కొనసాగించవచ్చు. ఈ ముగ్గురిలో రెండు చిన్న వ్యాపార సంస్థలతో పాటు, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ కొనుగోళ్లపై సుంకాలు చెల్లించిన వాషింగ్టన్‌ రాష్ట్రం కూడా ఉంది.

వాస్తవానికి మే 7న అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు (U.S. Court of International Trade) ఈ టారిఫ్‌లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా సుంకాల వసూళ్లను నిలిపివేయకుండా, కేసు దాఖలు చేసిన ముగ్గురు పిటిషనర్లకే పరిమిత ఉపశమనం కల్పించింది. దీనిపై ట్రంప్‌ ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లగా.. మే 12న అప్పీళ్ల కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చి టారిఫ్‌ల వసూళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అదే స్టేను మరింత కాలం కొనసాగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

అమెరికా సుప్రీంకోర్టు 2025లో ట్రంప్‌ విధించిన పలు టారిఫ్‌లను రద్దు చేసిన తర్వాత, ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్‌ ప్రభుత్వం ‘ట్రేడ్‌ యాక్ట్‌-1974లోని సెక్షన్‌ 122’ కింద కొత్తగా 10 శాతం గ్లోబల్‌ టారిఫ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే పరిమిత కాలానికి దిగుమతులపై సుంకాలు విధించే అధికారం కలిగి ఉంటారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ 10 శాతం గ్లోబల్‌ టారిఫ్‌ జూలైలో ముగియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్‌ గడువు పొడిగిస్తే మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, టారిఫ్‌ల చట్టబద్ధతపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. కేసు పూర్తయిన తర్వాత కోర్టు ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే.. ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ట్రంప్‌ టారిఫ్‌ విధానానికి ఇది తాత్కాలిక న్యాయ విజయం. అయితే ఈ 10 శాతం గ్లోబల్‌ టారిఫ్‌లు భవిష్యత్తులో కొనసాగుతాయా? లేక కోర్టు వాటికి బ్రేక్‌ వేస్తుందా? అన్నది తుది తీర్పుపైనే ఆధారపడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement