కోవిడ్ సీజనల్‌ వ్యాధిగా మారే ప్రమాదం!

Covid-19 will Prove to be Strongly Seasonal Disease - Sakshi

ఐక్యరాజ్య సమితి హెచ్చరిక  

జెనీవా: కోవిడ్‌ ఇకపై సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. చైనాలోని వూహాన్‌లో తొలిసారిగా కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పటికీ దాని చుట్టూ ఇంకా ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్‌ సీజనల్‌ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది.

శ్వాస కోశకు సంబంధించిన వ్యాధులన్నీ సీజనల్‌గానే వస్తాయని, శీతల వాతావరణం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు ఎక్కువని చెప్పింది. ఇక ఫ్లూ తరహా వ్యాధులు కూడా సమశీతోష్ణ ప్రాంతాల్లో కూడా తరచూ విజృంభిస్తూ ఉంటాయని వెల్లడించింది . కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకటే రకం వ్యాధి కావడంతో ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారుతుందని ఆ బృందం అభిప్రాయపడింది. అందుకే ఇప్పటికిప్పుడు వాతావరణ మార్పుల్ని అంచనా వేసుకొని కోవిడ్‌ ఆంక్షల్ని సడిలించవద్దని హెచ్చరించింది. అత్యంత శీతల వాతావరణంలో కరోనా వ్యాప్తి ఎలా చెందుతోందో, వేడి వాతావరణంలో కూడా అదే స్థాయిలో విజృంభిస్తోందని వచ్చే సీజన్లలో కూడా అలాగే జరిగే అవకాశం ఉందని బృందానికి నేతృత్వం వహించిన జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్‌ జెయిట్‌చిక్‌ చెప్పారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top