Covid-19: ‘చిన్నారుల్లో జలుబు’లా మారిపోతుంది

COVID-19: Covid will be like common cold in the next few years - Sakshi

అమెరికా, నార్వే సంయుక్త అధ్యయనంలో వెల్లడి  

వాషింగ్టన్‌: రాబోయే రోజుల్లో కోవిడ్‌–19 చిన్న పిల్లల్లో వచ్చే సాధారణ జలుబులా మారిపోతుందని అమెరికా, నార్వే తాజాగా నిర్వహించిన ఒక సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సినేషన్‌ తీసుకోని చిన్నారులపైనే ఈ వైరస్‌ ప్రభావం ఉంటుందని ఆ సర్వే తెలిపింది. ఇప్పటివరకు కోవిడ్‌–19 పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంతగా ప్రభావం లేదని పేర్కొన్న సర్వే, మిగిలిన వారంతా వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఈ వైరస్‌ ముప్పు పెద్దలకి తప్పిపోతుందని అంచనా వేసింది.

‘రాబోయే కాలంలో పెద్దలందరికీ వైరస్‌ సోకడం లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వస్తాయి. దీంతో ఈ వైరస్‌ తీవ్రత బాగా తగ్గిపోతుంది. వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే ఓ చిన్నపాటి జలుబులా మారిపోతుంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ ఒట్టర్‌ బోర్నస్టడ్‌ చెప్పారు. ఈ అధ్యయనం వివరాలను జర్నల్‌ సైన్స్‌ అడ్వాన్సెస్‌ ప్రచురించింది. ఒక్కసారి గత చరిత్ర చూస్తే ఎన్నో మహమ్మారులు తొలుత ఉగ్రరూపం దాల్చి  ఆ తర్వాత పిల్లలకి వచ్చే సాధారణ వ్యాధుల్లా మారిపోయినవి ఉన్నాయని ఆయన చెప్పారు.

‘1889–1890లో పెచ్చరిల్లిన రష్యన్‌ ఫ్లూ 10 లక్షల మందిని పొట్టన పెట్టుకుందని, ఇప్పుడా వైరస్‌ 7–12 నెలల పిల్లలకి వచ్చే సాధారణ జలుబులా మారింది. ఏదైనా మహమ్మారి చివరి దశకి వచ్చేటప్పటికి దాని తీవ్రత తగ్గిపోతుందని కోవిడ్‌–19 కూడా అలాగే మారుతుంది’ అని ప్రొఫెసర్‌ బోర్నస్టడ్‌ వివరించారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో కంటే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనే అధికంగా యాంటీ బాడీలు వచ్చినట్టుగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్టుగా ఆయన తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన చెప్పారు. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో కరోనా వైరస్‌ ఉధృతిని పరిశీలిస్తూ రియలిస్టిక్‌ ఏజ్‌ స్ట్రక్చర్డ్‌ (ఆర్‌ఏఎస్‌) మ్యాథమెటికల్‌ మోడ్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎలా ఉంటుందో అధ్యయనం చేసినట్టుగా బోర్నస్టడ్‌ వివరించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top