టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్‌లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చింది
సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్‌లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్‌లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనా
అమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్‌కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.
ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్‌లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.
ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.
ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్‌లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్‌ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


