As climate change Antarctic ice sheet continues to melt - Sakshi
Sakshi News home page

అంటార్కిటికా కరిగిపోతోంది! 

Published Wed, Mar 8 2023 1:25 AM | Last Updated on Wed, Mar 8 2023 8:17 AM

As climate change melts Antarctic ice - Sakshi

పర్యావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటి దెబ్బకు హిమ ఖండమైన అంటార్కిటికాలోనే మంచు రికార్డు స్థాయిలో కరిగిపోతోంది!  ఈ పరిణామంపై పర్యావరణ నిపుణులు  ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని దిద్దుబాటు చర్యలకు పూనుకోకుంటే పెను విపత్తులను చేజేతులా ఆహ్వనించినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు!

అంటార్కిటికాలో సముద్రపు మంచు పరిమాణం ఫిబ్రవరి 25న ఏకంగా 17.9 లక్షల చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. అక్కడి తేలియాడే మంచు పరిమాణాన్ని ఉపగ్రహ పరిశీలనల సాయంతో ఎప్పటికప్పుడు కచ్చితంగా లెక్కించడం మొదలు పెట్టిన గత  40 ఏళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి ఇదే! ఇలా అంటార్కిటికాలో మంచు పరిమాణం అత్యల్ప స్థాయిలకు  పడిపోవడం గత ఆరేళ్లలోనే ఏకంగా ఇది మూడోసారి కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. 2022లో అది 19.2 లక్షల చదరపు కి.మీ.గా  తేలింది.

1979లో ఉపగ్రహ ఆధారిత గణన మొదలైన నాటినుంచీ అదే అత్యల్పం! ఈ రికార్డు గత ఫిబ్రవరిలో బద్దలై మంచు పరిమాణం 17.9 లక్షల చదరపు కి.మీ.గా నమోదైంది. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 1.36 లక్షల చదరపు కి.మీ. మేరకు తగ్గిందన్నమాట! ధ్రువ  ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను ఇదిప్పుడు ఎంతగానో కలవరపరుస్తోంది. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా మంచు పరిమాణం బాగా తగ్గిపోతోందంటూ ఆ్రస్టేలియాలోని టాస్మేనియా యూనివర్సిటీలో అంటార్కిటికా ఖండపు మంచుపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ విల్‌ హాబ్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఖండపు పశ్చిమ భాగంలో గతేడాది మంచు ఊహాతీతంగా కరిగిపోయిందని, ఆ నష్టం నుంచి ఆ ప్రాంతాలింకా తేరుకోనే లేదని చెప్పారాయన. ‘‘నిజానికి సముద్రపు మంచుకు పరావర్తన గుణం చాలా ఎక్కువ. కనుక సూర్యరశ్మి కి పెద్దగా కరగదు. కానీ దాని వెనకాల నీరు చేరితే మాత్రం కిందనుంచి కరుగుతూ వస్తుంది. ఇప్పుడదే జరుగుతోంది’’ అని వివరించారు.      – సాక్షి, నేషనల్‌ డెస్క్‌


తీరాలన్నీ మునకే! 
అంటార్కిటికా మహాసముద్రంలో ఉండే అపార హిమ రాశి తీరానికి కాస్త సమీపంలో ఉండే మంచుపై తుఫాను గాలుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ హిమ రాశి ప్రస్తుత వేగంతో కరిగిపోతూ ఉంటే అలల తాకిడి వేగం బాగా పెరుగుతుంది. దాంతో సముద్రంలో తీరానికి సమీపంలో ఉన్న మంచూ క్రమంగా బలహీనపడి కరుగుతుంది. తర్వాత ఆ ఖండంలో నేలపై ఉన్న అపారమైన మంచుకు, హిమానీ నదులకు స్థిరత్వమిచ్చే ఈ ఆసరా శాశ్వతంగా కనుమరుగవుతుంది. 
 పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్, బెలింగ్‌హసన్‌ సముద్రాల్లో మంచు ఊహాతీత వేగంతో కరగడం శాస్త్రవేత్తలను మరీ కలవరపెడుతోంది. అంటార్కిటికాలో సగటు మంచు పరిమాణం 2014 దాకా ఎంతో కొంత పెరిగిన సమయంలో కూడా ఈ సముద్రాల్లో మంచు కరుగుతూనే వచ్చింది! 
 పశ్చిమ అంటార్కిటికాలోనే ఉన్న త్వాయిట్స్‌ హిమానీ నదం కూడా క్రమంగా కరుగుతోంది. కేవలం ఇదొక్కటి గనక పూర్తిగా కరిగిందంటే సముద్ర మట్టాలు ఏకంగా అర మీటరు పెరుగుతాయి! అందుకే దీన్ని ‘డూమ్స్‌డే గ్లేసియర్‌’గా పిలుస్తారు! 
 గత ఫిబ్రవరిలో తొలిసారిగా అంటార్కిటికా ఖండపు తీర రేఖలో ఏకంగా మూడింట 
రెండు వంతులు ఏ మాత్రం మంచు  లేకుండా సముద్రపు జలాలతో బోసిపోయి కనిపించిందట! 
అంటార్కిటికా సముద్రంలోని అపారమైన మంచు ఇలా కరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మీటర్ల మేరకు పెరుగుతాయి! 
 దాంతో తీర ప్రాంతాలన్నీ ముంపు బారిన పడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా నగరాలెన్నో ఈ జాబితాలోకి వస్తాయి! అది కోట్లాది మందిని నిర్వాసితులను చేసి ఊహించని పెను విషాదానికి దారి తీస్తుంది. 

మున్ముందు మరింత ముప్పే! 
సమీప భవిష్యత్తులో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం తగ్గే సూచనలేవీ పెద్దగా లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం అంటార్కిటికాపై కొన్నేళ్లుగా చాలా పడుతోంది. కనుక సముద్రపు మంచు కరిగే వేగానికి ఇప్పుడప్పట్లో అడ్డుకట్ట పడుతుందని భావించడం అత్యాశే’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన ఓషనోగ్రాఫర్, వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మాథ్యూ ఇంగ్లండ్‌ కుండబద్దలు కొట్టారు.

అక్కడి మంచు ఈ స్థాయిలో కరగడం కచ్చితంగా పెను ప్రమాద సూచికేనని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అంటార్కిటికా సముద్రంలోని మంచు ఈ స్థాయిలో కరిగిపోతుండటం వెనక గ్లోబల్‌ వారి్మంగ్‌తో పాటు ఇంకేమేం కారణాలున్నాయో వెదికి వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు. 

కోల్‌కతా, చెన్నైలకు ముంపు ముప్పు.. 
సముద్ర మట్టాల పెంపు వల్ల ముప్పు ముంపున్న మహా నగరాల జాబితాలో కోల్‌కతా, చెన్నై ముందున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ఇలాగే పెరుగుతూ ఉంటే 2100 నాటికి ఆ రెండు నగరాల్లో సముద్ర మట్టాలు 20 నుంచి 30 శాతం దాకా పెరిగే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆసియాలో యాంగూన్, బ్యాంకాక్, హోచిమిన్‌ సిటీ, మనీలా కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. 
సముద్ర ప్రవాహాల్లో మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. వీటితో పాటు ఎల్‌ నినో తదితరాల ప్రభావాలను కూడా అధ్యయనం చేసి న మీదట ఈ నివేదికను రూపొందించారు. 

విశేషాలు... 
 సముద్ర మట్టాల్లో పెరుగుదల కేవలం వాతావరణ మార్పులతో పోలిస్తే అంతర్గత వాతావరణ మార్పులూ తోడైనప్పుడు మరో 20, 30 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఎక్కువగా ఉంటుంది! 
అమెరికా పశ్చిమ తీరంతో పాటు ఆ్రస్టేలియాకు కూడా ఈ ముంపు సమస్య ఎక్కువగా ఉంటుంది.  
దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతా, ముంబై తీర ప్రాంతాల్లో వరదలు 2006తో పోలిస్తే 2100 నాటికి కనీసం 18 రెట్ల నుంచి ఏకంగా 96 రెట్ల దాకా పెరిగే ఆస్కారముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement