చైనాలో అడుగుపెట్టిన ట్రంప్‌.. ఎవరు స్వాగతం పలికారంటే? | Chinese Vice President Han Zheng receives Trump | Sakshi
Sakshi News home page

చైనాలో అడుగుపెట్టిన ట్రంప్‌.. ఎవరు స్వాగతం పలికారంటే?

May 13 2026 6:26 PM | Updated on May 13 2026 6:33 PM

Chinese Vice President Han Zheng receives Trump

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా చేరుకున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పలు సాంకేతిక సంస్థల ప్రధాన కార్యనిర్వాహకులు ఉన్నారు. బీజింగ్‌లోని విమానాశ్రయంలో ట్రంప్‌నకు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. చైనా అగ్రనేతల్లో హాన్ ఒకరు.

ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఆయనను పంపడం ద్వారా అమెరికా అధ్యక్షుడికి చైనా అమిత ప‍్రాధాన్యం, గౌరవం ఇస్తోందని భావిస్తున్నారు. గతసారి 2017 పర్యటన సమయంలో స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచీ అనే తక్కువ స్థాయి నేతను పంపారు. గత ఏడాది ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాన్ హాజరయ్యారు. కాగా, విమానాశ్రయ రన్‌వే నుంచి మోటర్‌కేడ్‌లో ట్రంప్‌ వెళ్లారు. బీజింగ్‌లో వచ్చే రెండు రోజుల పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్‌ చర్చలు జరపనున్నారు.  

వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం సహా పలు అంశాలపై షీ జిన్‌పింగ్‌తో ట్రంప్‌ చర్చించనున్నారు. ద్వైపాక్షిక చర్చలు, అధికారిక విందులో పాల్గొంటారు. “మేము రెండు మహాశక్తులం. సైనిక బలంలో భూమిపై అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. చైనాను 2వ స్థానంలో భావిస్తారు” అని ట్రంప్‌ కొన్ని గంటల క్రితం చెప్పారు.

బీజింగ్‌లో జరుగుతున్న ఈ సదస్సు దాదాపు 10 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో చేస్తున్న తొలి పర్యటనగా నిలిచింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో సున్నితమైన వాణిజ్య సంధిని కొనసాగిస్తూ కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చైనాలో ట్రంప్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో స్వాగత కార్యక్రమం, యునెస్కో వారసత్వ కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన, అధికారిక విందు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement