మేకలతో జూమ్‌ మీటింగ్‌... ఆదిరిపోయే ఆదాయం

Britain Woman Earns Lakhs By Zoom Meeting With Goat - Sakshi

బ్రిటన్‌ రైతు వినూత్న ఆలోచన 

రూ.50 లక్షలు ఆర్జించిన మహిళ 

లండన్‌: కరోనా మహమ్మారి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కొత్త అనుభవాన్ని మిగిల్చింది. ఉపాధి కోల్పోయిన వారు కొందరైతే, ఆరోగ్యాన్నీ, ప్రాణాల్ని సైతం కోల్పోయిన వారు కోకొల్లలు. లక్షలాది మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనా నేర్పిన అనుభవాల్లో జూమ్‌ మీటింగ్‌ ఒకటి. అయితే మనుషులు సమావేశమయ్యే జూమ్‌ మీటింగే కాదు, మేకలు హాజరయ్యే జూమ్‌ మీటింగ్‌ గురించి మీరు విని ఉండరు. కానీ, యూకేలోని రాసెండేల్‌కు చెందిన డాట్‌ మెక్‌ కార్టీ మేకలను జూమ్‌ మీటింగ్‌లోకి తెచ్చి అక్షరాలా 50 లక్షలు సంపాదించారు.  

లాక్‌డౌన్‌తో తగ్గిన ఆదాయం 
మేకలేంటీ? జూమ్‌ మీటింగేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే కానీ జూమ్‌ మీటింగ్‌ పెట్టుకునేది మేకలు కాదు. మనుషుల జూమ్‌ మీటింగ్‌కి మేకలు అటెండ్‌ అవుతాయి అంతే. అది కూడా ప్రత్యక్షంగా కాదు ఆన్‌లైన్‌లో. ! డాక్‌ మెక్‌ కార్టీకి కొంత పొలం ఉంది. అందులో ఆమె మేకలను పెంచుతున్నారు. వ్యవసాయంతో పాటు, మేకల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను విద్యార్థుల మేకల సందర్శనను కూడా ఒక ఆదాయ వనరుగా మలుచుకున్నారు మెక్‌ కార్టీ. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. వివాహాలకూ ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని అద్దెకిచ్చేవారు. అయితే, పెళ్లిళ్లకూ అవకాశం లేకపోవడంతో ఇటు మేకలూ, అటు మెక్‌ కార్టీకి ఖాళీ సమయం దొరికింది. ఆదాయమూ తగ్గింది.  

జోక్‌ అనుకున్నా.. నిజమయ్యింది..!  
అంతా జూమ్‌ మీటింగుల్లో మునిగిపోయిన సమయంలో మెక్‌ కార్ట్‌ మేకలూ జూమ్‌ మీటింగ్‌ కి అటెండ్‌ అవ్వొచ్చుగా అనిపించి, ఈ సరదా ఆలోచనని ఓ జోక్‌లా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వెబ్‌ సైట్‌లో ప్రకటించారు. తన మేకలను జూమ్‌ మీటింగుల్లో కనిపించడానికి అద్దెకిస్తానంటూ చేసిన ఈ ప్రకటనకు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో సరదాగా వచ్చిన ఈ ఆలోచన మెక్‌ కార్టీకి యిప్పుడు కాసులు కురిపిస్తోంది.‘‘నెటిజన్లు సరదాగా నవ్వుకునేందుకు 2020 ఏప్రిల్‌ లో తొలి లాక్‌డౌన్‌ అప్పుడు జోక్‌గా దీన్ని వెబ్‌సైట్‌లో పెట్టి, నిద్రపోయాను. మేల్కొనే సరికి ఈ ఆలోచనని ఆహ్వానిస్తూ 200 మెయిల్స్‌. అందరూ తమ తమ జూమ్‌ మీటింగ్స్‌లో మేకలను హాజరు పర్చాలంటూ రిక్వెస్టులు’’అని ఆనందాన్ని వ్యక్తం చేశారు మెక్‌.  

ఆనందం కోసమే..     
అయిదేళ్ల క్రితం తన తల్లి నుంచి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకున్న 32 ఏళ్ల మెక్‌ కార్టీ జూమ్‌ మీటింగుల్లో తన మేకలు పాల్గొనేలా చేసి, వారికి ఆనందాన్నిస్తున్నారు. జూమ్‌ మీటింగ్‌లను ఆహ్లాదపరిచేందుకు తన మేకలను వీడియో కాల్స్‌లో చమక్కున మెరిపిస్తున్నారు. అనేక సంస్థలూ, వ్యక్తులు, కుటుంబ సభ్యులు, తమ స్నేహితులను ఆశ్చర్యపరచడం కోసం మేకలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.  

ఒక్కో మీటింగ్‌కి మేకకు ఐదు పౌండ్లు 
మీటింగ్‌ వీడియో లింక్‌ వివరాలు పంపిస్తే చాలు మెక్‌ కార్టీ ఉద్యోగులు మేకలను వీడియో సమావేశంలో కనిపించేలా చేస్తారు. అయితే, ఒక్కో మీటింగ్‌కి మేక హాజరు ఖరీదు 5 పౌండ్లు. ఇలా ఇప్పటి వరకు మెక్‌ కార్టీ 50 వేల పౌండ్లు అంటే దాదాపు రూ.50 లక్షలు సంపాదించారు. యిప్పుడు తన మేకలు అంతర్జాతీయ మీటింగుల్లో పాల్గొంటున్నాయంటారు మెక్‌. రష్యా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు నిర్వహించే వర్చువల్‌ మీటింగ్స్‌లో తన మేకలను హాజరు పరుస్తున్నానని చెప్పారు. కొందరు దాని ఖరీదుకన్నా ఎక్కువగా డబ్బులు విరాళంగా ఇస్తున్నారట. తన వ్యవసాయ క్షేత్రాన్ని మెరుగుపర్చుకోవడానికీ, లాక్‌డౌన్‌ కాలంలో తన సిబ్బంది వేతనాలకూ ఈ మేకల జూమ్‌ మీటింగ్‌లు అవకాశం కల్పించాయంటారు మెక్‌ కార్టీ. ఆదాయం కోసం ఎరువుని విక్రయించడం కన్నా ఇది చాలా సులభతరంగా, ఆనందంగా ఉందంటారు మెక్‌.

చదవండి: పోలీస్‌ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
                 జూమ్ క్లాస్‌లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top