Kamala Harris: కమలా హ్యారిస్‌ స్ఫూర్తితో పుస్తకం

A Book On The Rise Of Indian Americans Inspired By Kamala Harris - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ఎన్నిక కావడంతోపాటు అమెరికాలో భారత సంతతి ప్రజలు సంఖ్యాపరంగా తక్కువే అయినా, పలుకుబడి కలిగిన వర్గంగా ఎదిగిన తీరుపై ఒక పుస్తకం వెలువరించేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, దౌత్యాధికారులు, వ్యాపారవేత్తలు, పలుకుబడి కలిగిన ప్రముఖుల బృందం ఇందుకోసం ముందుకు వచ్చింది.‘అమెరికాకు వచ్చి స్థిరపడిన మొదటి రెండుతరాల వారి ఆశలు, ఆశయాలకు కమలా హ్యారిస్‌ ప్రతీక. దేశ ఉపాధ్యక్షురాలి స్థాయికి కమల ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఆమె పడిన కష్టం, ఎదురైన ఆటంకాలు, ఆమె విజయానికి భారత సంతతి ప్రజలు చేసిన కృషి వంటివి ఈ పుస్తకంలో ఉంటాయి’ అని ఈ పుస్తక రచయితల్లో ఒకరు, ప్రముఖ అమెరికన్‌– ఇండియన్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఎంఆర్‌ రంగస్వామి వెల్లడించారు.

‘కమలా హ్యారిస్‌ అండ్‌ ది రైజ్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌’ అనే ఈ పుస్తకంలో అమెరికాలో భారత సంతతి ప్రజలు స్వయం కృషితో ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.40 లక్షల వరకు భారతీయ అమెరికన్లుండగా, అందులో 18 లక్షల మంది అర్హులైన ఓటర్లున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయురాలు, మొట్టమొదటి దక్షిణాసియా సంతతి అమెరికన్‌గా కమలా హ్యారిస్‌(56) చరిత్ర సృష్టించారు. ఆమె తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్‌ హ్యారిస్, తల్లి చెన్నైకు చెందిన శ్యామలా గోపాలన్‌. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top