Bomb Cyclone-Niagara Falls: మంచు తుపాను ఎఫెక్ట్‌.. గడ్డకట్టిన నయాగరా జలపాతం

Bomb Cyclone Niagara Falls Turn Into Icy Winter Wonderland - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్‌, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. 

అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

నయాగరా ఫాల్స్‌ న్యూయార్క్‌ స్టేట్‌ పార్క్‌ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top