breaking news
Niagara waterfall
-
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
అగ్రరాజ్యానికి ‘చలి’మంట!
సంపాదకీయం: శీతాకాలం అనగానే ఆకులు రాల్చుకున్న చెట్లు, వేకువజామున వీధి చివర కనబడే చలిమంట, దాని చుట్టూ అల్లుకునే కబుర్లు, దారీతెన్నూ తెలియనీయని పొగమంచు, మెరిసే మంచు ముత్యాలను సిగన తగిలించుకున్న పూలు గుర్తొస్తాయి. మన శ్రీనాథ మహాకవి క్రీడాభిరామంలో ‘ప్రక్కలు వంచు వంచి... మునిపండ్లను రాచు రాచి...రొమ్మిక్కిల జేసి చేసి....’ అంటూ తెల్లారగట్ట వణకించే చలి నిలువెత్తు మనిషిని మూటలా మార్చిన వైనాన్ని కళ్లకుగడతాడు. ఆ పద్యాన్ని చదివితే మండే ఎండలో సైతం చలి చేష్టలు గుర్తొచ్చి వణకాల్సిందే. నిన్నటివరకూ అమెరికాను చుట్టుముట్టిన హిమోత్పాతం వణికించడంతో ఆగలేదు. పౌరులను భీతావహుల్ని చేసింది. కంటినిండా కునుకులేకుండా చేసింది. ఉత్తర ధ్రువంవైపు నుంచి విరుచుకుపడిన చలి పులి ఆగడాలముందు అగ్రరాజ్యం నిస్సహాయంగా గడ్డకట్టుకుపోయింది. తెల్లారేసరికి ఇంటి ముందూ, పైనా, పక్కలా... ఎటు చూసినా గుట్టలుగా పేరుకుపోతున్న మంచును చూసి జనం విస్తుపోయారు. ఎన్ని పొరల వస్త్రాలున్నా,వాటికి ఎన్ని రగ్గుల్ని తోడు తెచ్చుకున్నా ఎలాగోలా ఒంట్లోకి దిగబడుతున్న చలి మనిషిని నిటారుగా నిలబడనీయలేదు. కార్లు కదలడానికి లేదు. విమానాలు ఎగరడానికి లేదు. చెట్ల కొమ్మలు ఊగడానికి లేదు. అన్నీ మంచులో కూరుకుపోయాయి. నిత్యం అంతెత్తునుంచి దూకే నయాగరా జలపాతం సైతం నిర్ఘాంతపోయినట్టు శిలాసదృశమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అమెరికాలో పరచుకున్న వాతావరణం... అంగారకుణ్ణి చూడటానికి ఉబలాటపడే ఔత్సాహికులందరికీ ఇక్కడే ఆ అనుభవాన్ని పంచింది. అంగారకుడిపై పచార్లు చేస్తున్న మార్స్ రోవ ర్ అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 25 నుంచి మైనస్ 31 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటున్నదని సమాచారం చేరేస్తుండగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యావరణ పరిశోధనలకని అంటార్కిటికా వెళ్లి తిరిగొస్తున్న రష్యన్ శాస్త్రవేత్తల నౌక మంచు పలకల మధ్య కొన్ని గంటలపాటు ఆగిపోయింది. దాదాపు నాలుగురోజులపాటు అమెరికాను ఒక పెద్ద ఫ్రిడ్జ్‌గా మార్చిన వాతావరణం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఈలోగా అది 21 మంది ఉసురుతీసింది. ఎందుకీ హిమప్రళయం? ఏమైంది భూమాతకు? అన్ని ప్రకృతివైపరీత్యాల్లాగే ఇది కూడా మన స్వయంకృతమేనని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఊళ్లను మింగే వరదలు, కడుపుమాడ్చే కరువు, క్షణాల్లో అన్నిటినీ మింగేయగలిగే సునామీలు, చెప్పా పెట్టకుండా వచ్చి చేటుచేసే భూకంపాలు... వీటన్నిటి తరహాలోనే ఈ హిమోత్పాతం కూడా భూతాపం పర్యవసానంగా సంభవించినదేనని వారి వివరణ. పెను చలిగాలులతోకూడిన హిమోత్పాతం సాధారణంగా ఉత్తర ధ్రువంలో ఉద్భవించి అక్కడే నిత్యమూ సంచరిస్తుంటుంది. కానీ, అది ఈసారి కట్టుదాటింది. పర్యవసానంగానే అమెరికాలోని 50 రాష్ట్రాలూ చిగురుటాకుల్లా వణికాయి. మంచు ఎడారులను తలపించాయి. ఇది అమెరికాతో ఆగదు... భవిష్యత్తులో యూరప్‌ను, అటు తర్వాత ఆసియానూ కూడా చుట్టుముడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దురాశ దుఃఖహేతువన్న సామెతను ఈ ఉత్పాతాలు గుర్తుకుతెస్తాయి. సంపన్న దేశాలన్నీ తమ సంపదను మరింత పోగేసుకోవడానికి వినాశకర ఉద్గారాలను నిత్యమూ వాతావరణంలోకి వదులుతున్నాయి. అందువల్ల జీవావరణమంతా దెబ్బతిని భూ వాతావరణం పెను మార్పులకు లోనవుతున్నది. మూడు కాలాలూ, ఆరు రుతువులన్న మాట చిన్నప్పుడు చదివే పాఠ్యపుస్తకాల్లో తప్ప కనబడటం తగ్గింది. ఒక్కరోజులోనే అన్ని కాలాలనూ దర్శించే దుస్థితి దాపురించింది. అకాల వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు మనకు నిత్యానుభవమవు తున్నాయి. ప్రధాన వాతావరణ వ్యవస్థలు ఎల్‌నినో, లానినోలు అనావృష్టిని, అతివృష్టిని, అతి శీతలాన్ని క్రమం తప్పకుండా కమ్ముతున్నాయి. భూతాపం వల్ల సముద్రమట్టాలు పెరిగి తీరంలో ఉండే మాల్దీవులు, కిరిబతి, మార్షల్ ఐలాండ్స్ వంటి ద్వీపదేశాలు జలప్రవేశం చేస్తాయని అంచనాలొస్తున్నాయి. అలాంటిదేమైనా జరిగితే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ వచ్చే అయిదుకోట్ల మంది పర్యావరణ శరణార్థులకు నీడనిచ్చేదెవరన్న ప్రశ్నను ప్రపంచదేశాలు ఇంకా పరిశీలనలోకి తీసుకోలేదు. పారిశ్రామికదేశాలు 70 శాతం కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయని గత అరవైయ్యేళ్ల గణాంకాలు చెబుతున్నాయి. అందులో అమెరికాదే అగ్రస్థానమని వేరే చెప్పనవసరం లేదు. దాని తలసరి కర్బన ఉద్గారాల పరిమాణం దాదాపు 20 మెట్రిక్ టన్నులు. మూడునెలలక్రితం పోలాండ్‌లో జరిగిన వాతావరణ సదస్సులో సైతం తమ తప్పులను పారిశ్రామిక దేశాలు గుర్తెరగలేదు. 2020నాటికల్లా భూతాపం తగ్గింపునకు చర్యలు తీసుకోవాలనుకున్న సంకల్పం వార్సాలో నీరుగారిపోయింది. ఎలాంటి వాగ్దానాలూ లేకుండానే సదస్సు ముసింది. 1990 స్థాయికన్నా తాము 2020కల్లా 25శాతం ఉద్గారాలను తగ్గించుకోగలమని చెప్పిన జపాన్ సైతం వార్సాలో చేతులెత్తేసింది. వచ్చే ఏడాది పారిస్‌లో కుదరగలదం టున్న ఒప్పందం రూపురేఖలు ఎలా ఉండబోతాయో ఇంకా చెప్పే పరిస్థితి లేదు. పారిశ్రామిక దేశాల మొండివైఖరే ఇందుకు కారణం. వాస్తవం చెప్పనిదానిని సైతం కళ కళ్లకు కడుతుందంటారు. లోగడ భూతాపంపైనా, దాని ప్రమాదకర పర్యవసానాలపైనా రూపొంది, అందరినీ చకితుల్ని చేసిన ‘ద డే ఆఫ్టర్ టుమారో’, ‘వాటర్ వరల్డ్’ వంటి చిత్రాలు ఎప్పుడో ఒకప్పుడు పచ్చి నిజాలుగా మారగలవని హిమోత్పాతం హెచ్చరిస్తున్నది. మొండివైఖరి అవలంబించేవారిలో ముందు వరసలో ఉండే అమెరికాకు ఒకవిధంగా ప్రకృతి చేసిన హెచ్చరికే హిమపాతం. దీన్నుంచి అయినా అగ్రరాజ్యం గుణపాఠం తీసుకుని పర్యావరణంపట్ల తనకున్న బాధ్యతను గుర్తెరుగుతుందేమో చూడాలి.