బురఖాతో ఆస్ట్రేలియా పార్లమెంటులోకి
సిడ్నీ: అది ఆ్రస్టేలియా పార్లమెంటు.. గంభీరంగా సాగుతున్న సభలోకి హఠాత్తుగా.. ఒక వ్యక్తి బురఖా ధరించి ప్రవేశించడంతో అంతా అవాక్కయ్యారు. అదెవరో కాదు.. ఆ్రస్టేలియాకు చెందిన ఫార్–రైట్ సెనేటర్ పాలిన్ హన్సన్. బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల బురఖా ధారణపై నిషేధం విధించాలన్న డిమాండ్‌ను వినిపించడానికి.. ఆమె ఏకంగా బురఖానే ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకోవడం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆస్ట్రేలియా రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపింది.
ముమ్మాటికీ జాత్యహంకారమే..
హన్సన్ చర్యపై సభలోని ఇతర సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన గ్రీన్స్ సెనేటర్, ముస్లిం మహిళ మెహ్రీన్ ఫరూకీ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇది పచ్చి జాత్యహంకారం. ఒక సెనేటర్ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం దారుణం’.. అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్రన్ ఆ్రస్టేలియాకు చెందిన స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమాన్ కూడా హన్సన్ తీరును అవమానకర చర్యగా అభివరి్ణంచారు.
ముక్తకంఠంతో ఖండన
హన్సన్ చర్యను అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ముక్తకంఠంతో ఖండించాయి. సెనేట్‌లో లేబర్ ప్రభుత్వ నాయకురాలు పెన్నీ వాంగ్ స్పందిస్తూ.. ‘ఇది ఆ్రస్టేలియా సెనేట్ సభ్యురాలికి తగని పని’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురఖా తీయడానికి నిరాకరించిన హన్సన్‌ను సస్పెండ్ చేయాలని ఆమె తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష కూటమి డిప్యూటీ లీడర్ అన్నే రస్టన్ కూడా హన్సన్ చర్యలను తప్పుబట్టారు.
గతంలోనూ ఇదే రచ్చ..
ఆసియా నుంచి వలసలు, శరణార్థుల రాకను తీవ్రంగా వ్యతిరేకించే హన్సన్, 1990ల నుంచే తనదైన వివాదాస్పద శైలితో వార్తల్లో నిలుస్తున్నారు. ఇస్లామిక్ దుస్తులపై ఆమె పోరాటం కొత్తేమీ కాదు. 2017లో కూడా ఆమె ఇలాగే బురఖా ధరించి పార్లమెంటుకు వచి్చ, జాతీయ స్థాయి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు.
బ్యాన్ చేస్తారా?.. నన్ను భరిస్తారా?
ఈ హైడ్రామా అనంతరం హన్సన్ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. తన బిల్లును సెనేట్ తిరస్కరించినందుకే ఈ నిరసన చేపట్టానని ఆమె స్పష్టం చేశారు. ‘పార్లమెంటు ఈ వ్రస్తాన్ని నిషేధించకపోతే, మహిళలపై అణచివేతకు, జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఈ రాడికల్
వ్రస్తాన్ని నేను సభలోనే ప్రదర్శిస్తాను. అప్పుడే ప్రతి ఆ్రస్టేలియన్‌కు దీని తీవ్రత అర్థమవుతుంది’.. అని స్పష్టం చేశారు. ‘నేను దీన్ని ధరించడం మీకు ఇష్టం లేకపోతే.. బురఖాను బ్యాన్ చేయండి’.. అని ఆమె సవాల్ విసిరారు.


