రష్యాను వణికించిన మరో భూకంపం.. సునామీ హెచ్చరిక | Another strong earthquake In Russia And tsunami waves possible | Sakshi
Sakshi News home page

రష్యాను వణికించిన మరో భూకంపం.. సునామీ హెచ్చరిక

Aug 3 2025 2:12 PM | Updated on Aug 3 2025 2:14 PM

Another strong earthquake In Russia And tsunami waves possible

మాస్కో: రష్యాలో వరుస భూకంపాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆదివారం కురిల్ దీవులలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైనట్టు జపాన్‌ వాతావరణ శాఖ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ వెల్లడించాయి. అలాగే, పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల ప్రకారం.. రష్యాలోని కురిల్ దీవులలో ఆదివారం ఉదయం భూమి కంపించింది. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు ఊగిపోయాయని రష్యా మీడియా తెలిపింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియలేదు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు.. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని  క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైనట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడినట్లు వెల్లడించింది. మరో ఘటనలో కమ్చట్కా ద్వీపకల్పంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతం క్ల్యూచెస్కీ బద్దలైంది.

హెచ్చరికలు జారీ.. 
ఇదిలా ఉండగా.. ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భారీ భూ ప్రకంపనల ధాటికి రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. పసిఫిక్‌ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. దాని ప్రభావంతోనే తాజాగా భూకంపం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement