ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా? | 20 million barrels of crude oil exited Strait of Hormuz in last 24 hours | Sakshi
Sakshi News home page

ఇప్పుడు హార్మూజ్ పరిస్థితి ఏంటి? ఇంధన రవాణా కొనసాగుతోందా?

Jun 25 2026 4:36 AM | Updated on Jun 25 2026 4:42 AM

20 million barrels of crude oil exited Strait of Hormuz in last 24 hours

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి అంతా హార్మూజ్ జలసంధిపైనే నిలిచింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భవిష్యత్తుపై ఇటీవల అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం హార్మూజ్ జలసంధి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇంధన రవాణా కొనసాగుతోందా? ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చేలా అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ వివరాలు తెలిపారు. హార్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా జరగడం భారత్‌కు కూడా చాలా ముఖ్యం.  

గత 24 గంటల్లో హార్మూజ్‌ జలసంధి నుంచి 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు బయటకు వెళ్లిందని క్రిస్ రైట్ తెలిపారు. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా ఘర్షణలకు ముందు ఉన్న స్థాయికి ఎక్కువగా చేరుకుందని, నౌకాదళ రక్షణతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా పునరుద్ధరణ అవుతున్నాయని క్రిస్ రైట్ తెలిపారు.

ఇరాన్-ఇజ్రాయెల్/అమెరికా ఉద్రిక్తతలు, ఘర్షణల కారణంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా కొంతకాలం తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో, యుద్ధానికి ముందు ఎంత మేరకు చమురు ట్యాంకర్లు ప్రయాణించేవో దాదాపు అదే స్థాయికి మళ్లీ చేరుతున్నాయని క్రిస్ రైట్ చెప్పారు. నౌకాదళ భద్రత ఉండటంతో ట్యాంకర్ రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని తెలిపారు.

72 నౌకలు.. 20 మిలియన్ బ్యారెళ్ల చమురు 
న్యూయార్క్‌లో జరిగిన రాయిటర్స్ గ్లోబల్ ఎనర్జీ ఫోరంలో క్రిస్ రైట్ మాట్లాడుతూ.. గత 24 గంటల్లో సుమారు 72 నౌకల ద్వారా 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ జలమార్గం గుండా తరలించారని చెప్పారు. ఈ పరిమాణం ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతుకు సమానం.  

రైట్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ముడి చమురు ఎగుమతులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నాయి. హార్మూజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం ఇప్పుడు ఇరాన్‌కు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ బెదిరింపును చాలా కాలంగా టెహ్రాన్ అత్యంత కీలక వ్యూహాత్మక సాధనంగా భావిస్తూ వచ్చింది.

“జలసంధిపై ఇరాన్ ఒకప్పుడు ఉన్న ప్రభావం క్రమంగా తగ్గుతోంది” అని రైట్ అన్నారు. ఘర్షణ సమయంలో ఆ దేశ సైనిక సామర్థ్యాలు చాలా బలహీనపడ్డాయని చెప్పారు. నౌకా రవాణా మెరుగుపడటంతో ప్రపంచ చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. సరఫరా అంతరాయాలపై భయాలు తగ్గడంతో బుధవారం ప్రామాణిక ముడి చమురు ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు $3 కంటే ఎక్కువగా పడిపోయింది. ఫిబ్రవరిలో ఇరాన్ ఘర్షణ ప్రారంభానికి ముందు ఉన్న కనిష్ఠ స్థాయికి చేరింది.

వెనిజులాలో చమురు ఉత్పత్తి పెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో తొలగింపు తర్వాత అమెరికా పరిపాలనలో ఆ దక్షిణ అమెరికా దేశం నుంచి ఎగుమతులు పెరిగాయని చెప్పారు.

ప్రస్తుత స్థాయితో పోలిస్తే వెనిజులా చమురు ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రైట్ తెలిపారు. 2029లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసేలోపు రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement