ట్రాఫికర్‌కు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫికర్‌కు చెక్‌

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

మాసబ్‌ట్యాంక్‌– షేక్‌పేట్‌ మధ్య మోడల్‌ కారిడార్‌

సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: మాసబ్‌ట్యాంక్‌– మెహిదీపట్నం– షేక్‌పేట్‌ ప్రధాన రహదారిని మోడల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు బల్దియా కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగర సీపీ సజ్జనర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీరి వెంట ట్రాఫిక్‌ చీఫ్‌ డి.జోయల్‌ డెవిస్‌ ఉన్నారు. అధికారులంతా బస్సులో ప్రయాణిస్తూ మార్గంమధ్యలోని బాటిల్‌ నెక్స్‌, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఈ మార్గంలో రోడ్డు దాటే పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, బృందావన్‌ కాలనీ రోడ్‌ నెం.1 వద్ద కొత్తగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీ) నిర్మించాలని, షేక్‌పేట్‌ నాలా వద్ద పెలికాన్‌ సిగ్నల్‌, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నానల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతిబౌలి నుంచి నానల్‌ నగర్‌ వరకు ఉన్న సెంట్రల్‌ మీడియన్‌ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్‌ఎండీసీ, డెల్‌ స్టోర్‌ ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్‌, బొడ్రాయి, షేక్‌పేట్‌ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు అధికారులను ఆదేశించారు. మాసాబ్‌ ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేయనున్నారు. మెహిదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్‌ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.

ప్రతి జోన్‌కూ రూ.20 కోట్లు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్‌ పనుల నిమిత్తం ప్రతి జోన్‌కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జోనల్‌ కమిషనర్లు జి.ముకుందరెడ్డి, ప్రియాంక ఆలా, ట్రాఫిక్‌ డీసీపీ కాజల్‌, చీఫ్‌ సిటీ ప్లానర్‌ కె.శ్రీనివాస్‌, చీఫ్‌ ఇంజనీర్‌ రత్నాకర్‌, అదనపు డీసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ ధనలక్ష్మి పాల్గొన్నారు.

షేక్‌పేట్‌ బృందావన్‌ కాలనీ వద్ద మ్యాన్‌హోల్‌ను పరిశీలిస్తున్న సజ్జనర్‌, కర్ణన్‌

రోడ్డుతో పాటు అవసరమైన ఐల్యాండ్స్‌ సైతం విస్తరణ

రెండో చోట్ల ఎఫ్‌ఓబీలు, ఒక ప్రాంతంలో పెలికాన్‌ సిగ్నల్‌

పోచమ్మబస్తీ నుంచి రోడ్‌ నెం.12కు స్లిప్‌ రోడ్డు నిర్మాణం

క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పోలీసు, బల్దియా కమిషనర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement