ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ బాధితురాలి సూసైడ్‌ | Tragedy After Jilted Lover Inject HIV Injection Hyderabad Medchal | Sakshi
Sakshi News home page

ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ బాధితురాలి సూసైడ్‌

Apr 10 2026 1:41 PM | Updated on Apr 10 2026 1:49 PM

Tragedy After Jilted Lover Inject HIV Injection Hyderabad Medchal

పోచారం ఐటీ కారిడార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిడ్స్‌ ఉందన్న కారణంతో ఓ వ్యక్తితో యువతి పెళ్లికి నిరాకరించగా.. సదరు ఉన్మాది కోపంతో ఆమెకు సిరంజీతో రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో.. బాధితురాలు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. 

హైదరాబాద్ శివారు పోచారంలో గత నెల అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ ఉదంతం తర్వాత కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చేరిన సదరు యువతి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

కఠోర నిజాన్ని దాచి.. 
పోచారానికి చెందిన మనోహర్‌కు ఆ మధ్య బాధిత యువతితో పెళ్లి ఖాయమైంది. గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకోవడంతో పాటు షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. పెళ్లికి టైం దగ్గర పడుతున్న టైంలో.. మనోహర్‌కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కోపంలో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. 

మార్చి11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్‌ను పట్టుకున్నారు.

అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేశారు. యువతి బలవన్మరణంతో ఈ ఉదంతం విషాదాంతంగా మారింది. నిందితుడు మనోహర్‌కు కఠిన శిక్ష పడాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement