30 జంక్షన్లలో ఏఎన్‌పీఆర్ కెమెరాలు
సాక్షి, సిటీబ్యూరో
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మూడు నెలల క్రితం చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదైంది. చోరీ చేసిన వ్యక్తి ఈ వాహనంపై గోల్కొండలో సంచరించాడు. విషయం పోలీసులకు తెలియకపోవడంతో వాహనం, చోరుడు చిక్కడం అరుదు.. నగరంలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. చోరీ వాహనాలకు, చోరులకు చెక్ చెప్పడం కోసం నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఐటీ సెల్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాజధానిలోని 30 జంక్షన్లలో ఉన్న ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పీఆర్) పరిజ్ఞానంతో పని చేసే సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో 12 చోరీ వాహనాలు దొరికాయి. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నేరగాళ్లకు చెక్ చెప్పడానికే డీసీపీ సీహెచ్ రూపేష్ నేతృత్వంలోని ఐటీ సెల్ ఏఎన్‌పీఆర్ సిస్టంను సిద్ధం చేసింది. దీనికోసం కంట్రోల్ రూమ్‌లో సర్వర్ ఏర్పాటు చేసింది.
సీసీటీఎన్‌ఎస్ డేటాతో అనుసంధానం..
● సిటీలోని ఠాణాల్లో నమోదైన ఇతర కేసుల మాదిరిగానే వాహన చోరీల వివరాలూ ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) అప్‌డేట్ అవుతాయి.
● ఈ వివరాలను సేకరిస్తున్న ఐటీ సెల్ ఏఎన్‌పీఆర్ సిస్టంతో పని చేసే కెమెరాలు అనుసంధానించి ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఆ చోరీ వాహనంలో సదరు 30 జంక్షన్లలోని ఏ కెమెరా నుంచి ముందుకు వెళ్లినా సర్వర్‌లోని సాఫ్ట్‌వేర్ తక్షణం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని పాప్‌అప్ రూపంలో కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి అందిస్తుంది.
ఆ రెండు ఠాణాలకు సమాచారం...
ఇలా పాప్‌అప్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ వివరాలను వాహనం చోరీపై కేసు నమోదైన, అది సంచరిస్తున్న పరిధిలోని ఠాణాలకు అందిస్తున్నారు. ఈ పోలీసుస్టేషన్లకు చెందిన బృందాలు ఆ వాహనం పదేపదే సంచరిస్తున్న ప్రాంతాల్లో మాటు వేసి పట్టుకుంటున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లో 12 వాహనాలు పట్టుకున్నారు. ఇక్కడ ఓ సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో చోరీ వాహనంలో ఓ ప్రాంతంలో సంచరించిన చోరుడు మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటికి నిఘా తగ్గి వాహనం దొరికే అవకాశాలు తగ్గుతాయని వివరిస్తున్నారు.
ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో..
ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తీర్చవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న వాహనం ఓ జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్లి మరో జంక్షన్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఠాణాలతో పాటు వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ఉన్న జంక్షన్లలోని ట్రాఫిక్ సిబ్బందికీ సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో తక్షణం వాహనాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. చోరీ వాహనాలను చోరులు అమాయకులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు దొరికినా అత్యధిక కేసుల్లో చోరులు మాత్రం చిక్కట్లేదు.
ఏఐ ద్వారా జనరేట్ చేసిన వాహనం
2 నెలల్లో దొరికిన 12 తస్కరణ వాహనాలు
వీటి సర్వర్‌తో సీసీటీఎన్‌ఎస్ డేటా అనుసంధానం
‘అపహరణ వాహనాన్ని’ గుర్తించిన వెంటనే పాప్‌అప్
స్థానిక పోలీసులకు సమాచారమిస్తున్న ఐటీ సెల్


