తెలంగాణ హైకోర్టులో పవన్‌ ఖేరాకు ఊరట | Relief For Pawan Khera in Telangana High Court | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టులో పవన్‌ ఖేరాకు ఊరట

Apr 10 2026 11:47 AM | Updated on Apr 10 2026 12:32 PM

Relief For Pawan Khera in Telangana High Court

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాకు ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యల కేసులో.. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. వారం రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, అలాగే విచారణకు సహకరించాలని పవన్‌ ఖేరాను ఆదేశించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్‌శర్మపై పవన్‌ ఖేరా(Pawan Khera) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయిన సంగతి తెలిసే ఉంటుంది. రిణికి భూయాన్‌శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్‌ ఖేరా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది.

పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పిటిషనర్‌ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందన్నారు. అయితే పిటిషనర్‌ భార్య ఇక్కడ నగరంలోని సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, అందువల్ల స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని.. ఈ పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. 

అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దేవజిల్‌ షైకీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదన్నారు. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని తెలిపారు. నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్‌కార్డు ఉందన్నారు. హైదరాబాద్‌ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుజన.. పిటిషనర్‌ పవన్‌ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement