బడంగ్‌పేట్: విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. డి.రవీందర్ అన్నారు. ఇందుకు విద్యార్థులతోపాటు అధ్యాపకులు, ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు సైతం కృషి చేయాలని పేర్కొన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్ ఎంవీఎస్‌ఆర్ (మాటూరి వెంకట సుబ్బారావు) ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం 2019– 23 బ్యాచ్ గ్రాడ్యూయేషన్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రవీందర్ మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ నినాదం ‘నిర్వహించు–సంస్కరించు–రూపాంతరించు’ అనే సిద్ధాంతాలతో జీవితంలో ముందుకు పోవాలన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మాట్లాడుతూ ఎంవీఎస్సార్ కళాశాలలో గత 42 ఏళ్లుగా నాణ్యమైన సాంకేతిక విద్యనందిస్తూ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని కొనియాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. కళాశాల చైర్మన్ డా.కె.పి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ కళాశాల నుంచి 25 వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఏడాదికేడాది ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కాలేజ్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందచేశారు. ఓయూ రిజిస్ట్రార్ పి.లక్ష్మినారాయణ, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, ఓయూ ఇంజనీరింగ్ ఫ్యాకల్టి డీన్ ఎం.కుమార్, ఉస్మానియా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ వెంకటేష్, ఎంవీఎస్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ, వైస్ ప్రిన్సిపాల్ ఎస్‌జీఎస్ మూర్తి, సొసైటీ సెక్రటరీ ఎం.కృష్ణకుమార్, వైస్ చైర్మన్ పీవీ కష్యప్, జాయింట్ సెక్రటరీలు వాసుదేవరావు, ఉమాదేవి, కోశాధికారి జూపూడి సుధాకర్, మెంబర్లు పార్థసారథి, ఎంవీఎస్ పవన్ కుమార్, హిరణ్మయి, సాగరిక, వెంకటేశ్వర గుప్త , ప్రభాకర్, కళాశాల ప్రొఫెసర్లు ప్రసన్నకుమార్, వేణుగోపాల్ రావు ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో క్యాంపస్ సందడిగా మారింది.
ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్
ఘనంగా ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే


