Hyderabad: ఆశారాం బాపుపై చీటింగ్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

Hyderabad: ఆశారాం బాపుపై చీటింగ్‌ కేసు

Mar 20 2023 4:36 AM | Updated on Mar 20 2023 12:06 PM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిని విక్రయించడంతో పాటు తన తండ్రి మరణానికీ కారణమయ్యాడంటూ హిమాయత్‌నగర్‌కు చెందిన కున్వర్‌ నరేష్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు రిజిస్టర్‌ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఆశారాం బాపు సహా మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. బాధితుడి కుటుంబం ఆశారాం బాపునకు భక్తులుగా ఉన్నారు. వీరు పలుమార్లు శంషాబాద్‌, అహ్మదాబాద్‌, సూరత్‌లోని ఆయన ఆశ్రయాలకు వెళ్లడం, బాపు కూడా పలుమార్లు నరేష్‌ ఇంటికి రావడం జరిగింది. 2004 అక్టోబర్‌ 28న నరేష్‌ తండ్రి మోహన్‌ సింగ్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆశారాం బాపు ఆశ్రమంలో ఇచ్చిన టానిక్‌, ప్రసాదం తీసుకోవడమే ఇందుకు కారణమని నరేష్‌ ఆరోపిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతడి శరీరంలో హెవీ మెటల్‌ పాయిజన్స్‌ ఉన్నట్లు చెప్పారని అతను ఆరోపిస్తున్నాడు.

ఓ దశలో తన తండ్రిని అహ్మదాబాద్‌లోని ఆశ్రమానికి తీసుకెళ్లగా, బాపు స్వయంగా ప్రసాదం ఇచ్చారని, హైదరాబాద్‌ తీసుకువచ్చిన తర్వాత తన తండ్రి మృతి చెందారని అతను పేర్కొన్నాడు. మోహన్‌ మరణం తర్వాత ఆయన కుటుంబం ఆస్తులకు సంబంధించి పార్టీషన్‌ డీడ్‌ రాసుకుంది. దీని ప్రకారం హిమాయత్‌నగర్‌లోని 1326 చదరపు గజాల స్థలం నరేష్‌ తదితరులకు వచ్చింది. ఇదిలా ఉండగా నరేష్‌, అతడి తల్లి మాలతి సింగ్‌, సోదరుడు అనంత్‌ సింగ్‌, ఆశారాం బాపు ఆశ్రమం ట్రస్ట్‌ ప్రతినిధి పంజక్‌ కుమార్‌, బీకన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు చెందిన బి.ప్రశాంత్‌ రెడ్డి, లోటస్‌ గృహ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి కట్టా లక్ష్మీకాంత్‌ మధ్య సదరు స్థలానికి సంబంధించి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

దీని ప్రకారం ఆ స్థలంలో 36 నెలల్లో జీ 4 అంతస్తులతో భవనం నిర్మించాలి. ఇందులో 60 శాతం స్థల యజమానులకు, 40 శాతం డెవలపర్లకు చెందుతుంది. మొదటి, మూడో అంతస్తులు స్థల యజమానులకు, నాలుగో అంతస్తు ఆశారాం బాపు ట్రస్ట్‌కు చెందేలా నిర్మాణం చేపట్టాలని ఇందుకు అయ్యే ఖర్చు ఇరు పక్షాలు 60:40 వంతున భరించాల్సి ఉంది. భవనం నిర్మాణంలో ఉండగానే ఆశారాం బాపు, ఆయన ట్రస్ట్‌తో నరేష్‌ కుటుంబానికి వివాదాలు మొదలయ్యాయి. దీంతో నరేష్‌ తల్లి మాలతి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి 2014 ఫిబ్రవరిలో స్టేటస్‌ కో పొందారు.

అయితే వాటిని ఉల్లంఘించి ఆశారాం బాపుతో పాటు ఆయన ప్రతినిధి, ఇతర సంస్థలు కుమ్మకై ్క సదరు స్థలాన్ని విక్రయించారని నరేష్‌ ఆరోపిస్తున్నారు. 2019–2020లో జరిగిన ఈ క్రయవిక్రయాలు ఇటీవల నరేష్‌ దృష్టికి రావడంతో అతను సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు నేరం జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దీని ఆధారంగా ఆశారాం బాపుతో పాటు మరో 13 మందిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement