న్యూస్‌రీల్
కాస్మోటిక్ చార్జీలు ఇవ్వరు..
రెండు నెలల క్రితం ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో 5వ తరగతి విద్యార్థి అన్వేశ్ తలకు గాయమైంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా రూ.2వేల బిల్లు కాగా.. ఫోన్‌పే ద్వారా తామే చెల్లించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇలా చిన్న చిన్న వైద్య ఖర్చులను సైతం తల్లిదండ్రులే భరిస్తుండగా క్రీడల శాఖ అధికారులు మాత్రం కంటితుడుపు చర్యలు చేపడుతూ మమ అనిపిస్తున్నారు.
నాలుగో తరగతి చదువుతున్న తన్వికశ్రీ అనే విద్యార్థిని సుమారు నెల రోజుల క్రితం గ్రౌండ్‌కు వెళ్తుండగా దారిలో కుక్కలు వెంటబడ్డాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తి జారి పడిపోవడంతో తలకు గాయమైంది. చిన్న గాయంగా పరిగణించి మరిచిపోయింది, వారం రోజుల తర్వాత వాంతులు కావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడింది. అందుకు సంబంధించిన వైద్య ఖర్చులు తల్లిదండ్రులే భరించాల్సిన పరిస్థితి.
ప్రథమ చికిత్సకూఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
● విద్యార్థుల వైద్య ఖర్చుల భారం తల్లిదండ్రుల పైనే..
● జేఎన్‌ఎస్‌లోని స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణపై నీలినీడలు
హనుమకొండ జేఎన్ స్టేడియం ఆవరణలోని క్రీడా పాఠశాల
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గత ఏడాది ప్రారంభించిన స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు స్పోర్ట్స్ స్కూల్‌లో చేర్పిస్తే వైద్య సేవలు అగమ్యగోచరంగా మారాయి. చిన్న గాయమైనా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం, వైద్యంపై భరోసా లేకపోవడంతో పిల్లలు ఆందోళన చెందుతున్నారు.
కనీస వైద్య సదుపాయాలు కరువు
క్రీడా పాఠశాల గత సంవత్సరం నవంబర్ 16న ప్రారంభమైంది. రెండో విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా కనీస వైద్య సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. పిల్లాడికి చిన్న దెబ్బతగిలినా ప్రథమ చికిత్సకు ఆస్పత్రికి పరుగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం జ్వరం గోలికి దిక్కులేని కంటితుడుపు చర్యలతో స్కూల్‌ను కొనసాగిస్తుండడం విశేషం. కాగా, ఈ గత నెలలో హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయి ఆదేశాలతో స్పోర్ట్స్ స్కూల్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వెళ్లేటప్పుడు తాత్కాలికంగా కొన్ని మందులు ఇచ్చి వెళ్లారు. అవి తప్పితే శాశ్వత ప్రాతిపదికన ప్రాథమిక వైద్యం కోసం మందులు అందుబాటులో ఉండేలా కనీస చర్యలు తీసుకోకపోవడం విశేషం.
141 మంది విద్యార్థులు
స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రస్తుతం 144 మంది విద్యార్థులు కొనసాగుతున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారిక లెక్కలు చెబుతోంది. 4, 5 తరగతులు కొనసాగుతుండగా 4వ తరగతిలో 34 మంది బాలురు, 45 మంది బాలికలు, 5వ తరగతిలో బాలురు 36, బాలికలు 29 మంది చదువుతున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మోటిక్స్ చార్జీల ప్రతిపాదనలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే ప్రతి విద్యార్థులకు కాస్మోటిక్స్ చార్జీలు అందనున్నాయి. పిల్లల వైద్య ఖర్చుల కోసం ఎంత ఖర్చు చేయాలన్న అంశంపై అధికారికంగా మాకు ఎలాంటి అనుమతులు రాలేదు. ప్రతినెలా జిల్లా వైద్యశాఖ అధికారులు క్యాంపు ద్వారా వైద్య సేవలందించడంతో పాటు ప్రాథమిక చికిత్సకు కావాల్సిన మందులు అందిస్తున్నారు.
– కొత్త ప్రశాంత్, డీవైఎస్‌ఓ, హనుమకొండ
సాధారణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు క్షౌ రం, సబ్బులు, కొబ్బరినూనె, పౌడర్ తదితర ఖర్చుల నిమిత్తం ప్రీమెట్రిక్ (5వ తరగతి లోపు) విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు రూ.150 చెల్లిస్తుంది. ఈ ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతున్న బాలబాలిలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించిన దాఖలాలు లేవు.


