ఇక ట్రెజరీ (ఈ–కుబేర్)
ద్వారానే వేతనాలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖగుర్తింపు హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్–ఫేస్ రికగ్నిషన్ సిస్టం) అమలు చేస్తున్నారు. అయితే గతేడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్న ఈ విధానంపై పర్యవేక్షణ లేదనే ఆరోపణలున్నాయి. పలు విభాగాలు, యూనివర్సిటీ వివిధ కాలేజీల్లోనూ ఇది మొక్కుబడిగానే కొనసాగిస్తున్నారని ఉద్యోగ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. ముఖ గుర్తింపు హాజరు విధానం వచ్చి 9 నెలలు గడుస్తున్నా కొందరు బోధన, బోధనేతర ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కొందరు ఆలస్యంగా వచ్చి ముందుగానే వెళ్లిపోతున్న వారు. మరికొందరు ఇలా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుకు ముఖం చూపించి వెళ్లిపోయి మళ్లీ సాయంత్రం వచ్చి నమోదు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అంతేగాకుండా సాంకేతిక కారణాలు చూపిస్తూ సరిగా హాజరు నమోదు చేసుకోని వారు కూడా అక్కడక్కడ ఉంటున్నారని ఆరోపణలున్నాయి. అయినా సంబంధిత అధికారులకు అంతగా పట్టింపులేదనేది విశ్వవిద్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.
ఎఫ్‌ఆర్‌ఎస్‌కు వేతనాల చెల్లింపునకు
అనుసంధానేమేది?
యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమల్లోకి తీసుకొచ్చాక కొన్ని నెలల అనంతరం తప్పనిసరిగా వేతనాల చెల్లింపునకు ముఖ హాజరు గుర్తింపు విధానానికి అనుసంధానించి ఆ హాజరు నమోదు ప్రకారమే వేతనాలు చెల్లిస్తామని గతంలోనే వీసీ ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటికీ అమల్లోకి తీసుకురాలేదనే ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు ప్రకారం కాకుండా ఆయా విభాగాలు, కార్యాలయాలు పంపిన హాజరు ఆధారంగా పూర్తి వేతనాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఎలాంటి అనుమతి లేకుండా..
ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేయించుకోని బోధన, బోధ నేతర ఉద్యోగులు, సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాని సందర్భాలు, ఆరోగ్యకారణాలతో ఏర్పడే ఇబ్బందులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం లాంటి కారణాలు కూడా ఉన్నా యి. మరోవైపు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీ సుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం సమర్థవంతంగా అమలుచేస్తున్నారు. జిల్లాల్లో హాజరు నమోదుచేయని ఉద్యోగులకు సంబంధిత అధికారులు షోకాజ్ నోటీసులు కూడా జారీచేస్తున్నారు. అయితే యూనివర్సిటీలో మాత్రం ఎఫ్‌ఆర్‌ఎస్ మొక్కుబడిగానే మారిందనే విమర్శలు వస్తున్నాయి.
బోధన, బోధనేతర ఉద్యోగులు,
పెన్షనర్లు వివరాలు..
కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకులు (అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు) 77మంది, కాంట్రాక్టు లెక్చరర్లు 172 మంది, నాన్‌టీచింగ్ ఉద్యోగులు 311మంది, నాన్‌టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు 155 మంది, సర్వీస్ పెన్షనర్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ కలిపి 498మంది, ఫ్యామిలీ పెన్షనర్లు 294మంది ఉన్నారు.
కేయూలో మొక్కుబడిగా
కొనసాగుతున్న ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ హాజరు
సమయపాలన పాటించని కొందరు బోధన, బోధనేతర ఉద్యోగులు
ఆలస్యంగా వచ్చి ముందుగానే
వెళ్లిపోతున్నారని వెల్లువెత్తుతున్న
ఆరోపణలు
అయినా పట్టించుకోని సంబంధిత అధికారులు
కేయూలోని బోధన, బోధనేతర ఉద్యోగులకు ఆగస్టు నెల వేతనాలు సెప్టెంబర్‌లో ట్రెజరీ ద్వారా (ఈకుబేర్) నేరుగానే జరగనున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకు వేతన బిల్లులను యూనివర్సిటీలోని సంబంధిత అధికారులు ట్రెజరీకి సమర్పిస్తే ఆ వేతనాల మొత్తం యూనివర్సిటీ అకౌంట్‌కు జమజేశాక మళ్లీ కేయూ అకౌంట్స్ విభాగం అధికారులు బోధన, బోధనేతర ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు వేతనాలు విడుదల చేస్తున్నారు. ఈ విధానానికి తెరపడబోతుందని తెలుస్తోంది.


