● సమ్మక్క సాగర్ బ్యారేజీలో పెరుగుతున్న వరద
కన్నాయిగూడెం: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని గోదావరిలోకి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని గోదావరిపై ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 1,20,300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆదివారం వరకు 78,500 క్యూసెక్కులు చేరిన వరద నీరు.. సోమవారం ఒక్కరోజు సుమారు 40 వేల క్యూసెక్కులు అధికంగా చేరి ప్రవహిస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లు ఎత్తి 1,12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న పంపింగ్..
దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద పంపింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. పంపింగ్ వద్ద మూడు ఫేజ్‌లలో 10 మోటార్లు ఉండగా కొన్ని రోజుల నుంచి 9 మోటార్లతో పంపింగ్ నిరంతరంగా కొనసాగిస్తున్నారు. దేవాదుల నుంచి దిగువన ఉన్న భీమ్ ఘన్‌పుర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేవాదుల వద్ద 77.80 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది.


