భాషాసాహిత్యాభివృద్ధికి పురస్కారాలు దోహదం | - | Sakshi
Sakshi News home page

భాషాసాహిత్యాభివృద్ధికి పురస్కారాలు దోహదం

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

తెలుగు అకాడమీ చైర్మన్‌ వెంకటనారాయణ

హన్మకొండ కల్చరల్‌: విశేషంగా సాహిత్య సేవ చేసిన ప్రముఖులకు అందించే పురస్కారాలు భాషాసాహిత్యాభివృద్ధికి దోహదపడతాయని తెలుగు అకాడమీ చైర్మన్‌ వెంకటనారాయణ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి హనుమకొండ వడ్డేపల్లిరోడ్‌లోని పీఆర్‌భవన్‌లో పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారం ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా కేయూ విశ్రాంతాచార్యుడు, కవి, విమర్శకులు బన్న అయిలయ్య, కవి బాసిరి సాంబశివరావుకు పురస్కారం అందజేశారు. కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వెంకటనారాయణ, విశిష్ట అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌, కవి వీఆర్‌ విద్యార్థి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పేర్వారం లాంటి గొప్ప కవిపేరుతో ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి స్మారక పురస్కారాలు అందిస్తున్న పేర్వారం కుమారులు శంకర్‌రావు, శ్రీనాథ్‌ అభినందనీయులన్నారు. పేర్వార విజయలక్ష్మి, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.

సామాజికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌ : వికసిత్‌భారత్‌ –రైజింగ్‌ తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ సేవాపథకం కార్యక్రమాలను రూపొందించాలని, యువత సామాజికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు కృషిచేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి కోరారు. సోమవారం కేయూ సెనెట్‌హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ విద్యావిధానం–2020 అకడమిక్‌ అంశాలతోపాటు విలువలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పాత్ర తరగతి గదికే పరిమితం కావొద్దన్నారు. బోధనతోపాటు అడాప్టబిలిటీ, ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌వంటి నైపుణ్యాలపై దృష్టిసారించాలన్నారు. ఈ దిశగా ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. గౌరవ అతిథి కేయూ స్టూడెంట్స్‌ ఆఫైర్స్‌ డీన్‌ ఇస్తారి మాట్లాడుతూ కేయూ ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఈసంనారాయణ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఎన్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్లు రాంబాబు, శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌, ప్రసన్నకుమార్‌, యుగేందర్‌, క్యాంపస్‌, న్యాయ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు రాధిక, ప్రభాకర్‌ మాట్లాడారు. ఉమ్మడివరంగల్‌జిల్లాలోని జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పరిశోధన కేంద్రాలుగా గుర్తింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల (అటానమస్‌), వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలను (అటానమస్‌) పరిశోధన కేంద్రాలుగా గుర్తిస్తూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అప్రూవల్‌ మేరకు రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ఉత్తర్వుల కాపీలను కేడీసీ ప్రిన్సిపాల్‌ గుర్రం శ్రీనివాస్‌, పింగిళి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ బత్తిని చంద్రమౌళికి వీసీ ప్రతాప్‌రెడ్డి మంగళవారం అందజేశారు. అలాగే, ఆ రెండు కళాశాలల్లోని మైక్రోబయాలజీ విభాగాలకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్లు పి. పల్లవి, జి. రేణుకను రీసెర్చ్‌ సూపర్‌వైజర్లుగా నియమించారు. వారిద్దరికి వీసీ ప్రతాప్‌రెడ్డి,రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వుల కాపీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement