కాశిబుగ్గ: ‘దవాఖానల్లో దప్పిక’ శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు చేసి, అవసరమైన కెమికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న నల్లాను కూడా రిపేర్ చేసి కొత్త నల్లాలు బిగించి, రోగుల అటెండెంట్లు నీరు పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు.
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి ఉన్న బాలబాలికలు https./satgasc. telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో సాట్ నిర్ణయించిన ఫీజులు వర్తిస్తాయని, గ్రామీణ శిబిరాల్లో మాత్రం ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు సైతం ఆన్‌లైన్ ద్వారా నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. క్రీడాసదుపాయాల మెరుగుదల కోసం నమోదు ఫీజులను వినియోగించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ క్రీడా ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో సంప్రదించవచ్చని డీవైఎస్‌ఓ ప్రశాంత్ తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఈ నెల 21న హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోిపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో 2026–30 కాలానికిగాను రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన డాక్టర్ పింగిళి రమేశ్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మూల జితేందర్‌రెడ్డి జాయింట్ సెక్రటరీగా ఎన్నికై నట్లు వారు తెలిపారు.
హసన్‌పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాయి ప్రసన్నకుమార్ (సీసీఎస్, వరంగల్ నుంచి నల్లబెల్లి) వి.గోవర్ధన్ (నల్లబెల్లి నుంచి వీఆర్, వరంగల్), జి.రామారావు(మడికొండ నుంచి ఘన్‌పూర్), ీసీహెచ్.రఘుపతి (ఘన్‌పూర్ నుంచి వీఆర్, వరంగల్), ఈ.నర్సింహారావు (ధర్మసాగర్ నుంచి ఎల్కతుర్తి), ఎ.ప్రవీణ్‌కుమార్ (ఎల్కతుర్తి నుంచి వీర్, వరంగల్), ఎ.శ్రీకాంత్ (వీఆర్, వరంగల్ నుంచి బచ్చన్నపేట), ఎస్.కె.హమీద్ (బచ్చన్నపేట నుంచి వీఆర్, వరంగల్), బి.మంగ (వీఆర్, వరంగల్ నుంచి ట్రాఫిక్ కాజీపేట)కు బదిలీ అయ్యారు.
ఇద్దరిపై వేటు
ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్క తుర్తి ఎస్సైగా విధులు నిర్వహించిన ఎ.ప్రవీణ్‌కుమార్‌కు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆయనను వీఆర్‌కు అటాచ్ చేశారు. బుధవారం బదిలీల్లో భాగంగా ఆయనకు వీఆర్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ చేసిన మరుక్షణమే ప్రవీణ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా నర్సంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవిపై సస్పెన్షన్ వేటు వేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. విచారణలో రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.


