కంటి ఆస్పత్రి.. కళావిహీనం
ఎంజీఎం: వరంగల్ నగరంలోని రీజినల్ ఐ హాస్పిటల్ ప్రస్తుత పరిస్థితి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. రోగులు, మహిళా జూనియర్ వైద్యుల భద్రతపై తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. ప్రజలకు కాంతి పంచాల్సిన ఈ ఆస్పత్రి ప్రస్తుతం అంధకారంలో మగ్గుతోంది. ప్రాంగణంలో సరైన వీధి దీపాలు లేకపోవడం, నిర్వహణ లోపించడం వల్ల రాత్రి వేళల్లో తీవ్ర చీకటి నెలకొంటోంది. దీనివల్ల రోగులు, వారి సహాయకులు, మహిళా జూనియర్ వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కుక్కలు, కోతుల బెడద
ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో కుక్కల, కోతుల బెడద తీవ్రతరమైంది. సరైన నిర్వహణ లేక రోజురోజుకూ సమస్య జఠిలమవుతోంది. రాత్రి సమయాల్లో డ్యూటీ ముగించుకుని హాస్టల్‌కు వెళ్లే మహిళా జూనియర్ వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. హాస్టల్ పరిసరాల్లో కూడా భద్రతా ఏర్పాట్లు తగినంత లేకపోవడం గమనార్హం. రోగులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఆస్పత్రి ప్రాంగణంలో తిరగడానికే భయపడే పరిస్థితి నెలకొంది. సరైన లైటింగ్, భద్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది.
అధికారులు తక్షణమే స్పందించాలి..
ఆస్పత్రి ప్రాంగణంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. కుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మహిళా వైద్యులు, రోగుల భద్రత కోసం సెక్యూరిటీ బలోపేతం చేయాలని, హాస్టల్, ఆస్పత్రి ఆవరణలో వసతులు మెరుగుపర్చాలని మహిళా జూనియర్ వైద్యులు కోరుతున్నారు.
అంధకారంలో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల


