మిషనరీ స్థలాల జోలికొస్తే ఊరుకోం
హన్మకొండ చౌరస్తా: ‘హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ముమ్మాటికీ క్రైస్తవ మిషనరీ ఆస్తులే. వీటి జోలికొస్తే ఊరుకోం’ అని సీబీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ రూబెన్ అన్నారు. మిషనరీ ఆస్తుల పరిరక్షణ త్రినగర క్రైస్తవ సమాజం ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. చర్చి నుంచి మొదలైన ర్యాలీ ఏషియన్ మాల్ మీదుగా తిరిగి సీబీసీ వరకు కొనసాగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టోఫర్ రూబెన్ మాట్లాడుతూ.. కొందరు ఇంటి దొంగల సాయంతో మరోసారి మిషనరీ ఆస్తులు అమ్మేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాదాపు 200 మంది రౌడీలు మిషనరీ ఆస్పత్రి ప్రహరీని కూల్చి లోపలికి చొచ్చుకొచ్చారని, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. తమ న్యాయ పోరాటానికి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కావ్య పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని, వారికి క్రైస్తవ సమాజం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి కమిటీ ప్రెసిడెంట్ టి.విజయ్‌స్వరూప్, జాయింట్ సెక్రటరీలు కె.విద్యాకర్, ఎన్.సునీల్, వైస్ ప్రెసిడెంట్లు ఎన్.జాన్సన్ ప్రసాద్, జె.డేవిడ్, ట్రెజరర్ డాక్టర్ బి.విల్సన్ వినయ్‌కుమార్, కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, కాంగ్రెస్ నాయకులు మోసెస్ ఆనంద్, తోట వపన్, పాస్టర్ జోసెఫ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తుల పరిరక్షణ కోసం క్రైస్తవ సమాజం ర్యాలీ
సీబీసీ సెక్రటరీ టి.క్రిస్టోఫర్ రూబెన్


