వాహనాలను ఓవర్‌టేక్ చేయవద్దు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ క్రైం: మేడారం మహా జాతరకు వచ్చే లక్షలాది వాహనాలు పోలీసులు సూచించిన విధంగా క్రమపద్ధతిలో రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో కోరారు. ఇంటి నుంచి జాతరకు వచ్చి, తిరిగి జాతర నుంచి ఇంటికి చేరుకునే వరకు భక్తులు వాహనాలను నడిపే విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఓవర్‌టేక్ చేయవద్దని ఆయన సూచించారు. మద్యం తాగి వాహనాలను నడపొద్దని, వరంగల్ కమిషనరేట్‌తో పాటు భూపాలపల్లి, కరీంనగర్, ఏటురునాగారం, ఛత్తీస్‌గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. రోడ్లపై వాహనాలను నిలిపి షాపింగ్ చేయవద్దని, ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలుపుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని పోలీసు అధికారులకు సహకరించాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.


