గ్రీవెన్స్‌పై నమ్మకం పోతోంది!
వరంగల్ అర్బన్: ‘ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా సమస్య పరిష్కారమవ్వడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదులివ్వాలి. గ్రీవెన్స్ సెల్‌పై నమ్మకం పోతోంది’ అంటూ పలు కాలనీలవాసులు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్‌లో అధికారులను నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, వింగ్ అధికారుల సమక్షంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 66 ఫిర్యాదులు రాగా, వాటిలో టౌన్ ప్లానింగ్‌కు 29, ఇంజనీరింగ్ సెక్షన్‌కు 22, రెవెన్యూకు 5, ప్రజారోగ్యానికి 5, నీటి సరఫరాకు 5 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అడిషనల్ కమిషనర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● కాజీపేట మడికొండ వెస్ట్‌సిటీలో పార్కు అభివృద్ధి పనులు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.
● 1వ డివిజన్ బాలాజీనగర్ ఎర్రగట్టుగుట్ట రోడ్డు–2లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు.
● హనుమకొండ ఏకశిల పార్కు వద్ద రెండు వైపులా డ్రెయినేజీ నిర్మించాలని అలయ కమిటీ ప్రతినిధులు కోరారు.
● 1వ డివిజన్ బస్వారెడ్డి టౌన్ షిప్‌లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● మడికొండ శ్రీ సాయి ఆర్పిడ్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని కాలనీవాసులు వినతి పత్రం అందించారు.
● నగర వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో వ్యాపా రం చేస్తున్న చిరువ్యాపారులకు శాశ్వత చిరునామా ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ప్రతి నిధులు కోరారు.
● వరంగల్ 13వ డివిజన్ దేశాయిపేట దళితవాడలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
● 19వ డివిజన్ శ్మశాన వాటికలో కనీస వసుతులు కల్పించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఎన్నిసార్లు అర్జీలిచ్చినా
స్పందించరెందుకు?
అధికారులను నిలదీసిన గ్రేటర్‌వాసులు
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్‌కు
66 ఫిర్యాదులు


