‘ప్రణామ్’లో వృద్ధులకు ఆహ్లాద వాతావరణం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు ఉచిత వైద్య సేవలు, చెస్, క్యారమ్ వంటి ఆటలతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడిపే సౌకర్యాలన్నీ ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో కల్పిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ నుంచి వర్చువల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా సుబేదారిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సెంటర్‌ను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ హనుమకొండలో ఈ కేంద్రం ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణరెడ్డి, బొద్దిరెడ్డి సతీశ్‌రెడ్డి, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జె.జయంతి పాల్గొన్నారు.


