
గృహాల్లో మొక్కలు నాటేలా చర్యలు
మేయర్‌గుండు సుధారాణి
రామన్నపేట: గృహాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఆర్పీ (రిసోర్స్ పర్సన్)లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. శుక్రవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మెప్మాకు చెందిన ఆర్పీలకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి చేపట్టారు. ఈసందర్భంగా.. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. సోమవారం నుంచి ప్రతీ వార్డులో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొక్కలు అందజేయాలని, ఈబాధ్య త ఆర్పీలదేనని స్పష్టం చేశారు. శానిటేషన్, హార్టికల్చర్ విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. స్థానిక కార్పొరేటర్ల సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ సూచించారు.
‘ఓపెన్’ డిగ్రీ,
పీజీ ప్రవేశాలకు గడువు
విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 2025–26 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు ఈనెల 13 వరకు గడువు ఉందని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ రెండేళ్లు, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ 10 ప్లస్ 2, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న వారు ‘డబ్ల్యూడబ్ల్యూబీఆర్‌ఏఓయూ.ఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరారు. పీజీ కోర్సుల్లోని ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు.