
అదనంగా యూరియా
ఎరువుల విక్రయాలపై తనిఖీ..
ఎరువుల విక్రయాలు, సరఫరా, వినియోగంపై పారదర్శకత, అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ఎరువుల తనిఖీలకు పూనుకున్నారు. ప్రతీనెల జిల్లాలో అత్యధికంగా ఎరువులు కొనుగోలు చేసిన 20 మంది జాబితాను వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. వీరు కొనుగోలు చేసిన ఎరువులు వారే వినియోగించారా..? అక్రమాలకు పాల్పడ్డారా..? వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైతులకు కాకుండా ఇతరులకు ఎరువులు విక్రయిస్తే ఆయా డీలర్లపై చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ–పాస్ మిషన్లను డీలర్లకు అందించారు. రైతు వేలిముద్ర వేస్తే ఆధార్ నంబర్‌తో సహా వివరాలు రాగానే వాటిని నమోదు చేస్తారు. దీంతో రైతుల వారీగా వివరాలు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది.
హన్మకొండ: యూరియా కొరత అంటూ జరిగిన ప్రచారంతో రైతులు ఎరువుల షాపుల ఎదుట కొనుగోలుకు క్యూకట్టారు. దీంతో జిల్లాలో అవసరానికి మించి యూరియా సరఫరా జరిగింది. గతేడాదితో పోలిస్తే అదనపు యూరియా రైతులకు చేరింది. వ్యవసాయశాఖ వానాకాలం ప్రణాళిక మేరకు ఎరువులు, విత్తనాలు సమకూర్చుతోంది. యూరియా కొరత అంటూ విస్తృత ప్రచారంతో రైతులు ఉదయాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట వరుసకట్టారు. కొందరు నిలబడలేక వరుస క్రమంలో చెప్పులు పెట్టడంతో యూరియా కొరత ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. సహకార సంఘాలకు తమ సభ్యులు కాని రైతులు రాకుండా నివారించేందుకు కొన్ని సంఘాలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేశాయి.
అన్ని ఎరువులు కలిపి
91,877 మె.ట.గా అంచనా..
హనుమకొండ జిల్లాలో 307 ఎరువుల షాపులు, 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నారు. గతేడాది వానాకాలంతో అన్ని కలిపి 57,478 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడారు. ప్రస్తుత సీజన్‌లో అన్ని ఎరువులు కలిపి 91,877 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 33,523 మెట్రిక్ టన్నులు, డీఏపీ 12,416, ఎన్‌పీకే 31,040, ఎంవోపీ 9,932, ఎస్‌ఎస్‌పీ 4,966 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం యూరి యా 2,853.99 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది.
డిమాండ్ మేరకు ఎరువుల సరఫరా..
పత్తి, మొక్కజొన్న, కూరగాయల తోటలకు మాత్రమే యూరియా అవసరం. యూరియా కొరత ప్రచారంతో వరిసాగు రైతులు సైతం ముందుగానే యూరియాను సమకూర్చుకున్నారు. గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ప్రస్తుత జూలైలో 6,261 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. 1,361 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటివరకు 1,51,383 ఎకరాల్లో సాగైంది.
గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నులు..
ప్రస్తుతం 6,261 మెట్రిక్ టన్నుల సరఫరా
హనుమకొండ జిల్లాలో 2,853 మెట్రిక్ టన్నుల నిల్వ
అత్యధికంగా కొనుగోలు చేసిన వారి జాబితా సేకరణ
రైతులకు కాకుండా ఇతరులకు విక్రయిస్తే చర్యలు
నానో యూరియా వాడాలి..
భూమిలో వేసే యూరియా బదులుగా నానో యూరియా వాడితే పంటలకు, రైతులకు మేలు. భూమిలో వేసే యూరియా 30శాతం మాత్రమే పంటకు చేరుతుంది. 70 శాతం వృథాగా పోతుంది. నానో యూరియా నేరుగా మొక్కలపై పిచికారీ చేయడం వల్ల మొక్కకు పూర్తిగా చేరుతుంది. రైతుల అవసరాల మేరకు సరఫరా చేస్తున్నాం. ఎరువుల కొరత లేదు. రైతులు ఆందోళన చెందొద్దు.
– రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయాధికారి, హనుమకొండ

అదనంగా యూరియా