
సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం
హన్మకొండ/హన్మకొండ కల్చరల్: సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం అని, అలాంటి సాహిత్య సృజన చేసే వారి సంఖ్య పెరిగినప్పుడే సమాజంలో చైతన్యం వస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెండు ఉమామహేశ్వర్ కలం నుంచి జాలు వారిన ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కృషి ఉంటేనే మనిషి ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడన్నారు. పుస్తక రచయిత మెండు ఉమామహేశ్వర్ తన అనుభవాల సారాన్ని మనసు–మనిషి పుస్తకంలో లిఖించారని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మానవజాతి కలుషితమైపోయిందని, ఇది అణుబాంబు కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. మన జీవితాలు ఉదయం కల్తీతో ప్రారంభమై కల్తీతో ముగుస్తున్నాయన్నారు. అద్భుతాలు సృష్టించే వారంతా అతి సాధారణ కుటుంబాల నుంచే వచ్చారని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇటీవల మరణించిన తన సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్‌కు అంకితం ఇవ్వడం సోదరుల మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనం అన్నారు. అనంతరం రచయితను సన్మానించారు. సమన్వయకర్తగా ఆర్.లక్ష్మణ్ సుధాకర్ వ్యవహరించారు. సీనియర్ పాత్రికేయులు దాసరి కృష్ణారెడ్డి, శంకేశి శంకర్‌రావు, ప్రముఖ సైకాలజిస్ట్ జి.నాగేశ్వరరావు, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మైమ్ కళాధర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాంపల్లి సదాశివ పాల్గొన్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత
సిరికొండ మధుసూదనాచారి
‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ