
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. అమ్మవారిపేట 220 సబ్ స్టేషన్ విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న కారణంగా కుమ్మరిగూడెం, అయోధ్యపురం, కొత్తపల్లి, న్యూ శాయంపేట ప్రాంత వ్యవసాయ సర్వీస్‌లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని భవాని నగర్, శ్రీనివాస కాలనీ, కళ్యాణి ఫంక్షన్ హాల్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. నర్సంపేట రోడ్డు, రాంకీ, దయానంద కాలనీ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఎల్‌ఐసీ, కలెక్టరేట్, అబ్బనికుంట, అల్పాహారం, యాకూబ్‌పుర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, చింతల్, తూర్పు కోట, పడమర కోట, మధ్య కోట, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘ఇకనైనా కళ్లు తెరవాలి’
హన్మకొండ: విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యాలయాల యాజమాన్యాలు ఇకనైనా కళ్లు తెరవాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ స్టేటస్ కోసం, మార్కుల మోజులో, ర్యాంకుల వేటలోపడి పిల్లల మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఒత్తిడికి గురిచేస్తున్న వాళ్లందరికీ విద్యార్థిని శివాని ఆత్మహత్య ఓ గుణపాఠం వంటిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని శివాని ఆత్మహత్య మొదటిది కాదని, అయితే, చివరిది అయ్యేలా తామంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లల అభిరుచి, వారి లక్ష్యాన్ని గుర్తించకుండా, పరిగణలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు చేసిన ఒత్తిడితో వారు బలన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.
సేవాదళ్ లోగో ఆవిష్కరణ
రామన్నపేట: వరంగల్ నగరంలోని గోవిందరాజుల స్వామి దేవాలయం మెట్ల వద్ద సేవాదళ్ సభ్యులు సేవాదళ్‌లోగోను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌లో సేవాదళ్ ఆధ్వర్యంలో చేపట్టే గోశాల నిర్వహణ, భజగోవింద, దళిత గోపాలం కృష్ణాష్టమి వేడుకలు వంటి అంశాలపై కార్యవర్గ సభ్యులు చర్చించారు. ఈ ఏడాది నిర్వహించే గోవింద రక్ష కార్యక్రమానికి వరంగల్ నగరంలోని మహిళా ప్రముఖులందరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. అతి కొద్దికాలంలోనే గోవిందాద్రి సేవాదళ్‌ను హిందూ సంఘాల ఐక్యవేదిక గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ గౌరవ అధ్యక్షుడు చింతాకుల అనిల్, వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్‌కుమార్, అధ్యక్షుడు యాట ప్రతాప్, సహాయ కార్యదర్శి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు పట్టాబి రాజేశ్వరి పాల్గొన్నారు.
గుండెపోటుతో టీచర్ మృతి
విద్యారణ్యపురి: హనుమకొండ చైతన్యపురిలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అలుగువెళ్లి జవహర్‌రెడ్డి (61) హఠాన్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌కు జిల్లా హుజూరాబాద్‌కు చెందిన జవహర్‌రెడ్డి (జవహర్ పటేల్) 1984లో ఎస్‌జీటీగా నియమితులై భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలో సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల కమాన్‌పూర్ మండలం నర్సిహులపల్లికి బదిలీ అయి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. మృతుడికి భార్య శ్రీదేవి, కుమారులు శశాంక్‌రెడ్డి, శంతన్‌రెడ్డి ఉన్నారు.
ప్రధానోపాధ్యాయుడికి అవార్డు
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మన్నె చంద్రయ్యకు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవారత్న అవార్డు అందజేశారు. చంద్రయ్య సామాజిక సేవలకుగాను స్నేహితుల దినోత్సవం సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం ఉత్తమ సేవారత్న అవార్డును అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పులి దేవేందర్, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు