
విద్యలో అంతరాలు తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్‌లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె.వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ.. 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మా ట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్‌గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు,రవీందర్‌రాజు, శ్రీధర్‌రాజు పాల్గొన్నారు.
బెనిఫిట్స్ చెల్లించాలి..
రిటైర్డ్ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం టీఎస్‌యూటీఎఫ్ హసన్‌పర్తి మండల అధ్యక్షురాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎ.శోభారాణి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జనరల్ సెక్రటరీ పెండెం రాజు, మాజీ ఎంఈఓ రాంకిషన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి