భవిత భళా..! | - | Sakshi
Sakshi News home page

భవిత భళా..!

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

ఏటా వేల మందికి ప్రవేశాలు

పాఠశాలలో ప్రయోగాలు

జాతీయస్థాయిలో భావి శాస్త్రవేత్తలకు విస్తృత అవకాశాలు

చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచేలా కేంద్రం పలు కార్యక్రమాలు

సమస్యలకు పరిష్కారం చూపే మేధస్సు ఉంటే ప్రోత్సాహకాలు

నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ రిజిస్ట్రేషన్‌కు నేడు తుది గడువు

ఇన్‌స్పైర్‌ మానక్‌ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం

విద్యార్థినులకు ప్రోత్సాహంగా విజ్ఞాన్‌ జ్యోతి

తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠంలో సందేహాలను నివృత్తి చేసుకోవడం సాధారణంగా విద్యార్థుల్లో కనిపించే లక్షణం. అదే తరహాలో చెట్టు నుంచి ఆపిల్‌ కింద పడితే అది ఎందుకు కింద పడిందని తనలో తాను ప్రశ్నించుకోవడం ద్వారా భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్న న్యూటన్‌ గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణలతో ప్రపంచం గర్వించే శాస్త్రవేత్తగా నిలిచారు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం. సీవీ రామన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. ఇదంతా గతంగా మారుతోంది. సమాజంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుమరుగు అవుతున్నారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులు తప్ప ఇక ఏవీ లేవనే ధోరణి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భావి శాస్త్రవేత్తలను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
బాల మేధ..

ఆసక్తి ఉండాలే కానీ వేల మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు, ప్రోత్సాహకాలు మన దేశంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఐఐటీల్లో 10,250 సీట్లు భావి శాస్త్రవేత్తలకు ఉన్నాయి. 31 ఎన్‌ఐటీల్లో 18,750 సీట్లు ఉన్నాయి. ఇస్రో, నాసాల ద్వారా ఏటా వెయ్యి మందికి 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. దేశంలో పరిశోధనా రంగంలోనూ అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రోబోటిక్‌ సైన్స్‌కు విశేష ఆదరణ ఉంది. మరోవైపు శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉంది. అది ఎంతగా అంటే దేశ జనాభాలో కేవలం నాలుగు శాతమే శాస్త్రవేత్తలు ఉన్నారు. నేటి విద్యార్థులు బంగారు భవిష్యత్తు సాధించడంతోపాటు దేశానికి మేలు చేయడానికి ఈ చక్కని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచి భవిష్యత్‌ శాస్త్రవేత్తలను తయారు చేసే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలను అమలు పరుస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, వివిధ సమస్యలకు తమ మేధస్సుతో పరిష్కారం చూపగలిగే చిట్టిబుర్రల కోసం అన్వేషిస్తోంది. అలాంటి బాల మేధావులకు నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ చక్కటి వేదికగా మారుతోంది. దీని ద్వారా ఏటా అందించే నినాదంపై విద్యార్థులు తమ మేధస్సుతో చూపే పరిష్కార మార్గాన్ని నివేదిక రూపంలో తయారు చేసుకుని జిల్లాస్థాయిలో జరిగే సెమినార్‌లో దానిని న్యాయనిర్ణేతల ఎదుట చెప్పాలి. ఇందుకు గాను నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు రిజిస్ట్రేషన్‌ గడువు సోమవారం ముగియనుంది.

యువికా యువ శాస్త్రవేత్త

యువికా పేరుతో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 9వ తరగతి స్థాయిలో విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల రెసిడెన్షియల్‌ శిక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మోడల్‌ రాకెట్రీని నిర్మించడం, రోబోటిక్‌ కోడింగ్‌, డ్రోన్‌ ప్రదర్శనలు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడం ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. యువికా యంగ్‌ సైంటిస్ట్‌ కార్యక్రమానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఖర్చులకు నిధులు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సైట్‌లో యువికా యంగ్‌ సైంటిస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఆవిష్కరణల కేంద్రంగా ఇన్‌స్పైర్‌ మానక్‌

కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్‌స్పైర్‌ మానక్‌ వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏటా వేలాది చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న భారీ కార్యక్రమంగా దీనిని చెప్పుకోవచ్చు. పాఠశాల స్థాయిలో ఇలాంటి ఆలోచనలకు బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతోపాటు సైన్స్‌ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్‌స్పైర్‌ మానక్‌ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఆన్‌లైన్‌లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, రెసిడెన్షియల్‌, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి జరిగే మేలు వంటి అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్‌ టీచర్‌ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టు తయారీకి రూ.10 వేల చొప్పున నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.

ఓ ఎగ్జిబిషన్‌లో తాము తయారు చేసిన ప్రాజెక్టులతో విద్యార్థులు (ఫైల్‌)

బడుల్లోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించడం లక్ష్యంగా అటల్‌ టింకరింగ్‌ లాబొరేటరీస్‌ (ఏటీఎల్‌)ను అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ద్వారా అమలు చేస్తున్నారు. ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు పాఠశాలలకు గ్రాంట్లను అందిస్తుంది. విద్యార్థులు భావనాత్మక సిద్ధాంతాలను ఆచరణాత్మక ఆవిష్కరణలుగా మార్చడానికి త్రీడీ ప్రింటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, మైక్రో కంట్రోలర్లు, అధునాతన శాసీ్త్రయ కిట్‌ల గురించి తెలుసుకుంటారు.

విద్యార్థినుల్లో శాసీ్త్రయ ఆలోచనలు రేకెత్తించి, ప్రతిభావంతులైన బాలికలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైన విజ్ఞాన్‌ జ్యోతి. ఈ పథకం ద్వారా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలు అర్హులు. శాసీ్త్రయ కౌన్సెలింగ్‌, నిపుణుల ఉపన్యాసాలు, మహిళా శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష సంభాషణ, బాలికల్లో పరిశోధనాసక్తిని ప్రోత్సహించడం, సైన్స్‌ ల్యాబ్‌లు, రక్షణ అకాడమీలు, టెక్నాలజీ హబ్‌లకు పూర్తి నిధులతో కూడిన సందర్శనలు ఇందులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement