వర్క్‌ ఇన్‌స్పెక్టర్లే ‘బినామీ’ కాంట్రాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లే ‘బినామీ’ కాంట్రాక్టర్లు

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

ఏఈలు, డీఈలతో కుమ్మకై ్క రూ.కోట్లలో టెండర్ల మాయాజాలం అధికారుల లాగిన్‌లతో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేతివాటం ఏసీబీ సోదాలతో వెలుగులోకి అసలు వాస్తవాలు

కమీషన్ల రగడ.. ఆగిన బిల్లులు

జీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగంలో అక్రమాల బాగోతం

గుంటూరు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులను కొందరు అధికారులు, సిబ్బంది తమ జేబులు నింపుకొనే వ్యాపారంగా మార్చేశారు. నాణ్యతను పర్యవేక్షించాల్సిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్లే చక్రం తిప్పుతూ ‘బినామీ’ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఉన్నతాధికారుల అండతో సాగుతున్న ఈ వ్యవహారం ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆకస్మిక సోదాలతో బట్టబయలైంది.

నెహ్రూనగర్‌: గుంటూరు నగర పరిధిలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా కొందరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి వార్డు ఎమినిటీ సెక్రటరీలుగా పోస్టింగులు కేటాయించారు. కానీ వారు నిర్దేశిత విధులకు వెళ్లకుండా వారికి నచ్చిన చోటే పనులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఏఈలు, డీఈలతో కుమ్మకై ్క తమకు నచ్చిన ప్రాంతాల్లో బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

లాగిన్‌లు వారివే.. పనులూ వారివే!

టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారుల లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు సైతం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేతుల్లోనే ఉండటం గమనార్హం. పనులు చేసేది, ఆన్‌లైన్‌లో టెండర్లు అప్‌లోడ్‌ చేసేది వీరే కావడంతో రూ.కోట్ల విలువైన పనుల్లో భారీ మాయాజాలం నడిచింది. ఇందులో కొన్ని పదుల సంఖ్యలో వర్కులకు అసలు టెండర్లే లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లెస్సు పర్సంటేజీలు మార్చేసి నగరపాలక సంస్థ ఖజానాకు రూ.కోట్ల మేర గండి పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

టీడీపీ నేతల పేరుతో వసూళ్లు

నగరంలో సాగే ప్రతి పనికీ అధికార టీడీపీ నేతలకు పర్సంటేజీల రూపంలో కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన ఓ వార్డు ఎమినిటీ సెక్రటరీ మరింత చేతివాటం ప్రదర్శించాడు. సదరు టీడీపీ ముఖ్య నేతకు కమీషన్‌ ముట్టజెప్పాలంటూ ఓ కాంట్రాక్టర్‌ నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని తానే కాజేశాడనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నేత తన వాటా కోసం ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కార్పొరేషన్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఏఈల బదిలీలు జరగడంతో ఇంజినీరింగ్‌ విభాగంలో సరికొత్త వివాదం మొదలైంది. గతంలో పనిచేసిన అధికారులకు కాంట్రాక్టర్లు ముందుగానే భారీగా కమీషన్లు ముట్టజెప్పారు. అయితే నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొందరు ఏఈలు ఆ పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్‌ చేయాలంటే తమకు మళ్లీ కమీషన్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే పాత అధికారులకు ముడుపులు చెల్లించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్లు, మళ్లీ ఇచ్చే స్తోమత లేక లబోదిబోమంటున్నారు. బిల్లుల ఫైళ్లు కదిలేది లేదని అధికారులు భీష్మించుకు కూర్చోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు జరిపి ఈ దోపిడీ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అసలైన కాంట్రాక్టర్లు, నగర ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement