గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఏపీటీఎఫ్ చేపడుతున్న నిరవధిక ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు పిలుపునిచ్చారు. ఆదివారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. టెట్‌పై ఇన్ సర్వీస్ సీనియర్ ఉపాధ్యాయులు ఎంతో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయులకు పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. మంగళగిరిలోని విద్యాభవన్ ముందు చేపట్టే ధర్నా విజయవంతం చేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీద్, జిల్లా శాఖ కార్యదర్శులు చక్కా వెంకటేశ్వరరావు, పచ్చల శివరామకృష్ణ, కంబా శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా రాష్ట్ర కౌన్సిలర్ ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, జిల్లా కౌన్సిలర్లు కిశోర్ షా, గురుమూర్తి, ఖుద్దూస్, జహంగీర్ పాల్గొన్నారు.


