చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జక్కంపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో తుపాకుల దుర్గాభవానీ, యేసుబాబు(31) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కాగా, యేసు బాబు ట్రాక్టర్ నడుపుకుని జీవనం సాగిస్తుంటాడు. గురువారం ఉదయం పనికి వెళ్లిన యేసుబాబు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో ఆలస్యం ఎందుకయ్యిందని భార్య ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు నిద్రలేచిన దుర్గాభవానీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని అన్నయ్య ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్న యేసుబాబు నిద్రలేచి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో మనస్తాపం చెంది విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో యేసుబాబు బావమరిది దుర్గారావు విషయాన్ని గమనించి వెంటనే 108 ద్వారా కొత్త ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. దుర్గాభవానీ ఆసుపత్రికి చేరుకునే సరికే యేసుబాబు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఘటనపై కొత్తపేట పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు, దేవస్థాన ప్రచార రథంపై మూర్తులతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఘాట్‌రోడ్డు వద్ద ఆలయ అర్చకులు, ఈవోలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన నున్నారు.
4న ట్రస్ట్ బోర్డు సమావేశం...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జూలై 4వ తేదీన బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఆషాఢ సారె ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాల నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.


