మున్సిపల్ ఉద్యోగుల తీరుపై నిరసన
తెనాలిఅర్బన్: మున్సిపాలిటీ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని మార్కెట్ సెంటర్లోని చిరువ్యాపారులు నిరసన గళం విప్పారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం తమ నిరసన తెలిపారు. తరచూ వేధిస్తుంటే తాము వ్యాపారాలు ఎలా చేసుకోవాలని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నిలదీశారు. తెనాలిలో మున్సిపల్ మార్కెట్ సెంటర్.. ఎందరో చిరువ్యాపారులకు నిలయం. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో పండ్లు విక్రయించుకుంటూ ఎంతోకొంత సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడ వ్యాపారాలు చేసేవారున్నారు. వీరిలో 50– 60 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నవారూ ఉన్నారు. మామూళ్లు ఇస్తే ఒకరకం... లేకుంటే మరోరకం అన్నట్టుగా మున్సిపాలిటీ ఉద్యోగులు వీరిపై జులం ప్రదర్శిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనీ, ట్రాఫిక్‌కు అవరోధమని రకరకాలుగా చెబుతూ తోపుడుబండ్లు, వాటిపై సరుకులు, కాటాలు, లైట్లు తీసుకెళ్లి, మున్సిపాలిటీలో పడేస్తున్నారు. అవి తిరిగి ఇవ్వమంటే నానా బూతులూ తిడుతున్నారు. ప్రతిసారి ఇలా చేయటంతో విసిగిపోయిన వ్యాపారులు శుక్రవారం మున్సిపాలిటీ ఎదుట నిరసనకు దిగారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసి వెంకట్రామయ్య అనే ఉద్యోగిపై వారు తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో డబ్బులు ఇచ్చేవాడినని, ఇప్పుడు వ్యాపారాలు సరిగా లేక ఇవ్వకపోవడంతో తమపై దౌర్జన్యం చేస్తున్నట్లు జేమ్స్ అనే వ్యాపారి ఆరోపించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపై ఇంత చిన్నచూపు ఎందుకంటూ ప్రశ్నించారు. మంగమ్మ మాట్లాడుతూ కొందరూ మున్సిపల్ ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందికరంగా తయారైందని, సరిగా వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా మంత్రి మనోహర్, ఉన్నతాధికారులు స్పందించి తమపై జూలుం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు.


