నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఉద్యమం

Jun 27 2026 1:37 AM | Updated on Jun 27 2026 1:37 AM

బొల్లాపల్లి: నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి పోరాటలకు సిద్ధంగా ఉండాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. మండలం కండ్రిక గ్రామంలో శుక్రవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని కండ్రిక గ్రామంతో పాటు మరో నాలుగు గ్రామాల్లో తాత్కాలిక బోర్లు వేయడం తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. అప్పట్లో 60 అడుగుల్లో పడిన నీళ్లు, ఇప్పుడు 1000 నుంచి 2000 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ట్యాంకర్లతో నీళ్లు పోసి, ఓట్లు వేయించుకున్నాక ఆ ట్యాంకర్లను కూడా వెనక్కి తీసుకుపోతున్నారని మండిపడ్డారు. పక్కనే నాగార్జున సాగర్‌ (ఎన్‌ఎస్పీ) కాల్వ ప్రవహిస్తున్నప్పటికీ, ఒంగోలు వరకు తాగునీరు అందిస్తున్న ఆ కాల్వ నుంచి ఈ ప్రాంతంలోని నాలుగు గ్రామాలకు కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా దక్కకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ జూలై 6న నరసరావుపేట కలెక్టరేట్‌ ముట్టడించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ కార్యదర్శి బుదాల శ్రీనివాసరావు, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి యోహాను, యువజన సంఘం నాయకుడు సుభాని, నాయకులు రాయబారం వందనం, కొప్పరపు మల్లికార్జున, రామారావు, అప్పారావు, పవన్‌ పాల్గొన్నారు.

పక్కనే సాగర్‌ కాలువ అయినా గొంతు ఎండుతున్ననాలుగు గ్రామాలు 6న నరసరావుపేట కలెక్టరేట్‌ ముట్టడి

నష్టపోయిన పసుపు రైతులకుపరిహారం వెంటనే చెల్లించాలి

లక్ష్మీపురం: దుగ్గిరాల శుభం పసుపు కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం వలన నష్టపోయిన బాధిత పసుపు రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం క్వింటాకు రూ.7 వేలు చొప్పున నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 296 మంది రైతులకు చెందిన(404 బాండ్లు) పసుపు కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదానికి గురైందన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్వింటాకు రూ.7 వేల చొప్పున పరిహారం ఇప్పిస్తామని రైతులతో ఒప్పందం చేసుకుంది. రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇంత వరకు సింగిల్‌ పైసా నష్టపోయిన బాధిత రైతులకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి క్వింటాకు రూ.5 వేలు మాత్రమే ఇస్తామని కూటమి నేతలు చెప్పటం చాలా దారుణం అన్నారు. ఒప్పందం చేసుకున్న మేరకు క్వింటాకు రూ.7 వేలు చొప్పున తక్షణమే చెల్లించాలని, రైతులను మోసగించి నష్టపరిచిన శుభం మహశ్వరి కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యానికి పసుపు మార్కెట్లో ఉన్న లైసెన్స్‌ రద్దు చేయాలని, దాంతో పాటు రాష్ట్రంలోఎక్కడా వ్యాపారం చేయకుండా శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement