రాష్ట్ర హోంమంత్రి వి.అనిత ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేద్దాం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
మంగళగిరి టౌన్: విద్యార్థులు నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి పట్టణం రత్నాల చెరువు జాతీయ రహదారి వెంబడి ఉన్న ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతు గ్రేహౌండ్స్ తరహాలోనే ఈగల్ టాస్క్‌ఫోర్స్ కూడా భవిష్యత్‌లో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌ను సాకారం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈగల్ టాస్క్‌ఫోర్స్ ఉపయోగిస్తున్న అధునాతన టెక్నాలజీ పనితీరును చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈగల్ తరహా మోడల్‌ను అడాప్ట్ చేసుకోవడానికి చూస్తున్నాయని తెలిపారు. గడిచిన రెండేళ్లలో సుమారు 1,20,300 కేజీల గంజాయిని డిస్ట్రాయ్ చేశామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏజన్సీ ఏరియాల్లో పల్లెనిద్ర కార్యాక్రమాన్ని చేసి గంజాయి సాగు నిర్మూలనపై గిరిజనులకు ధైర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యవంతమైన సమాజ స్ధాపనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నూతనంగా ఈగల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించామని, ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలోని గంజాయి, డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు చేరవేయవచ్చని వెల్లడించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఈగల్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీలు మహేశ్వరరాజు, నగేష్‌బాబు, స్వరూపారాణి, ఎన్‌సీబీ ప్రతినిధి త్రివేది, ఈగల్ స్పెషల్ పీపీ శైలజ, డీఎస్పీలు త్రినాథ్, దుర్గా ప్రసాద్, సింగయ్య పాల్గొన్నారు.


