‘క్రిటికల్‌’గానే పనులు | - | Sakshi
Sakshi News home page

‘క్రిటికల్‌’గానే పనులు

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

‘క్రిటికల్‌’గానే పనులు

యూనిట్‌లో ఉండే విభాగాలు ఏవంటే...

ముందుకు సాగని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ పనులు రెండోసారి గడువు పెంచేందుకు వినతి అప్పటికి పూర్తి అయ్యే అవకాశాలు తక్కువే

ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి

తెనాలి జిల్లా వైద్యశాలలో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నాం. ఆగస్టు చివరి నాటికి దాదాపు పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కానీ కొన్ని పనులు మిగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాటిని సెప్టెంబర్‌లో పూర్తి చేసి అప్పగిస్తాం. – వీరాస్వామి. ఏఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ

తెనాలిఅర్బన్‌: ఒకడుగు ముందుకు రెండు అడగులు వెనక్కి అన్న చందాన తెనాలిలో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇటీవల దానిలో పనిచేసే కార్మికుడు వడ దెబ్బ తగిలి మరణించటంతో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన కార్మికులు ఆందోళనతో ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో కొద్ది రోజులు పూర్తిగా పనులు నిలిచిపోయాయి. వేసవి తీవ్రత తగ్గడంతో పనులు పునః ప్రారంభించారు.

గత వైఎస్సార్‌ సీపీ హయాంలో..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలో వంద పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాణం కోసం రూ.45 కోట్ల నిధులు వెచ్చించింది. స్థల కేటాయింపు.. పాత భవనాలు కూల్చివేత వంటి పనులు పూర్తి చేసుకుని 2023 డిసెంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎలిక్సర్‌ మిట్‌ ఫాం ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పనులు ప్రారంభించింది. ప్రస్తుతం శ్లాబ్‌లు పూర్తి అయి ప్లాస్టింగ్‌ స్టేజ్‌లో భవనాలు ఉన్నాయి. ఇంకా దీనిలో ఫ్లోరింగ్‌, వాల్‌ కేర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ వర్కు, తలుపులు, కిటికీల ఏర్పాటు వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే వార్డుల ఏర్పాటుకు సంబంఽధించిన కొన్ని నిర్మాణాలు చేయాల్సి ఉంది.

నిధుల కేటాయింపులు ఇలా...

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.45 కోట్లలో రూ.22 కోట్లు భవన నిర్మాణ పనులకు కేటాయించారు. మిగిలిన నిధులు ఆపరేషన్‌ థియేటర్‌, క్యాజువాలిటీలలో వస్తువుల కొనుగోలు, వార్డులలో మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించనున్నారు.

ముందుకు సాగని పనులు

భవనాన్ని 2025 ఏప్రిల్‌లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ అప్పట్లో ఎర్రమట్టి, ఇసుక లభ్యత లేకపోవటం వలన సుమారు ఏడాది పాటు నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేసినా చంద్రబాబు ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు కొంత కాలం నిలిపివేసింది. చేసేది లేక కాంట్రాక్టర్‌ పనులు ఆపారు. గడువును పొడిగించాలని కోరారు. దీంతో ఉన్నతాధికారులు 2026 ఏప్రిల్‌ వరకు పొడిగించారు. అప్పటి నుంచి పనులు జరుగుతున్న ఆశించిన స్థాయిలో వేగంగా జరగటం లేదు. అంతేకాకుండా రెండు నెలల క్రితం వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు కార్మికుడు మృతి చెందాడు. దీంతో పనులు పూర్తిగా నిలిపివేశారు. కొద్దిరోజుల నుంచి మళ్లీ పనులు పునః ప్రారంభమైయ్యాయి. పనులను ఆగస్టుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. ఇప్పటి వరకు పొడిగింపు అనుమతులు లభించలేదు.

తెనాలి చేరుతున్న వస్తువులు

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఇనుప మంచాలు, పరుపులు, ఆపరేషన్‌ థియేటర్‌లో ఏర్పాటు చేసే వస్తువులు వంటివి ఆస్పత్రికి వచ్చేశాయి. ఇంకొన్ని రావాల్సి ఉంది. అవి కూడా భవన నిర్మాణం పూర్తి అయ్యే నాటికి వస్తాయని అధికారులు చెబుతున్నారు. రోగులకు ఉపయోగపడే ఈ యూనిట్‌ త్వరితగతిన ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం ఇకనైనా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఇంటిన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ) విభాగాన్ని 20 పడకలతో (చిన్నపిల్లలకు అవసరమైన నాలుగు బెడ్‌లు కలిపి) ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైడిఫినిషిన్‌ యూనిట్‌ (హెచ్‌డీయూ) 20 పడకలు, ఐసోలేషన్‌ వార్డు 30 పడకలతో, ఐసోలేషన్‌ గదులు 12, డయాలసిస్‌ బెడ్‌లు 4, ఎంసీహెచ్‌ (బాలింతలకు) 4 బెడ్‌లు, అత్యవసర విభాగం 10 పడకలతో నిర్మించనున్నారు. ఇవి కాకుండా మూడో అంతస్తులో రెండు ఆపరేషన్‌ థియేటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement