● మిగిలిన వారి వ్యాపారాలను
దెబ్బతీస్తున్న కొత్త హోటల్ యాజమాన్యం
● మంత్రి పేషీలోని వ్యక్తి ఫోన్లతో
నిత్యం దాడులపర్వం
● రంగంలోకి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు,
జీఎస్‌టీ, సివిల్ సప్లైస్ అధికారులు
● మండిపడుతున్న ఇతర హోటల్
యజమానులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో ఇటీవల కొత్తగా ఒక హోటల్ ప్రారంభమైంది. దానిని మంత్రి నారా లోకేష్ ప్రారంభించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఈ హోటల్ యాజమాన్యంలో ఒకరికి లోకేష్ పేషీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తితో బంధుత్వం ఉంది. దీంతో వారు వ్యాపారం ప్రారంభించగానే తమకు పోటీగా ఉన్న హోటళ్లపై ఫిర్యాదులు చేయడం, అధికారులతో దాడులు చేయించడం మొదలు పెట్టారు. గుంటూరు నగరంలో ముఖ్యమైన హోటళ్లు 70 శాతానికిపైగా ఒకే సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. మిగిలిన కొద్ది హోటళ్లు మాత్రమే ఇతర సామాజిక వర్గాల చేతిలో కొనసాగుతున్నాయి.
వరుస ఫిర్యాదులు.. ఆపై దాడులు
కొత్త హోటల్ ప్రారంభం కాగానే అదే ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్‌పై ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు దాడులు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉంచిన చికెన్ ఉందంటూ హడావిడి చేశారు. తర్వాత బిర్యానీకి పేరొందిన మరో హోటల్‌పై దాడులు చేశారు. ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్లే ఈ దాడులు చేస్తే ఇబ్బంది వస్తుందనుకుని జీఎస్‌టీ, సివిల్ సప్లయిస్ శాఖ వారితో కూడా దాడులు చేయించడం మొదలు పెట్టారు. జీఎస్‌టీ అధికారులు ఇటీవల వరుసగా హోటళ్లపై దాడులు చేస్తూ 12 హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. సివిల్ సప్లయిస్ విభాగం వారు నాలుగు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగం అక్రమమని నోటీసులు జారీ చేశారు.
ఆదేశాలు అక్కడి నుంచే...
అధికారులకు కూడా లోకేష్ పేషీలో ఉన్న వ్యక్తి స్వయంగా ఫోన్లు చేసి ఈ దాడులు చేయిస్తున్నారని ఇతర హోటల్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్దతి కొనసాగితే తాము చూస్తూ ఊరుకోబోమని వారు అధికార పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. కక్ష గట్టి దాడులు చేయించడంపై ప్రశ్నిస్తున్నారు. కొందరు నగరంలో జరుగుతున్న వ్యవహారంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లగా అందరిని కూర్చొబెట్టి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. లోకేష్ పేషీ నుంచి జోక్యం ఆగకపోతే తమ నిర్ణయం తాము తీసుకుంటామని హోటల్ యజమానులు స్పష్టం చేస్తుండటంతో ఈ వ్యవహారం అధికారపార్టీలో చర్చకు దారితీసింది.
ఎవరైనా కొత్తగా వ్యాపారం పెడితే నాణ్యతపై దృష్టి పెట్టి కస్టమర్లను పెంచుకోవాలని ఆలోచిస్తారు. అయితే గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన హోటల్ యజమానులు దీనికి భిన్నంగా ఆలోచించారు. తమ ప్రాంతంలో ఉన్న ఇతర హోటళ్ల వ్యాపారాలను దెబ్బతీయడం ద్వారా తాము లబ్ధి పొందాలనుకున్నారు. దీనికి రాజకీయ ఒత్తిడి తెచ్చి అధికారులతో దాడులు చేయించడంతో ఇతర వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


