బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కేతవరం శ్రీ వజ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామికి శాంతి కల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కొండపైన స్వయంభువుగా వెలసిన స్వామి వారికి విశేష అభిషేక, పుష్పాలంకరణ చేశారు. కల్యాణ వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో సుదర్శన మహా యాగ పూర్ణాహుతి చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి సన్నిమెళ్ళ కోటిరెడ్డి, ఆలయ అర్చకులు దివి చెన్న కేశవాచార్యులు, ప్రసన్న కుమార ఆచార్యులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా డెప్యూటీ డైరెక్టర్‌గా పి.జ్యోతిలక్ష్మీదేవిని నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గుంటూరులో డీడీగా విధులు నిర్వర్తిస్తున్న యు.చెన్నయ్యను ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.జ్యోతిలక్ష్మీదేవికి డీడీగా పదోన్నతి కల్పించి గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు.
నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యలో తన అభ్యున్నతికి మార్గ నిర్దేశం చేసిన నాటి గురువులను ఐపీఎస్ అధికారి శుక్రవారం ఇంటికి వెళ్లి సత్కరించారు. నరసరావుపేటకు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్ర రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌కేఆర్‌బీఆర్ మున్సిపల్ స్కూల్ (గాలి కోటయ్య స్కూల్)లో తనకు విద్యాబుద్ధులు నేర్పించిన అప్పటి ఉపాధ్యాయులు వజ్జా సుబ్బారావు, డానియేల్, మౌలాలి, కందిమళ్ల ఆదినారాయణ తదితరుల గృహాలకు వెళ్లి తన ఉన్నతికి వారే కారణమని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు.
సత్తెనపల్లి: సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ బి. అరుణను యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో 2025 డిసెంబర్‌లో జరిగిన ఓ గర్భిణి ప్రసవం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇది సక్రమం కాదంటూ అమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు విచారించిన అనంతరం బంక అరుణ బదిలీని రద్దు చేసింది. లేకుంటే సత్తెనపల్లి సమీప వైద్యశాలలో డాక్టర్‌గా నియమించాలని కూడా సూచించింది. ఆమెను హిందూపురం బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్ రిజిస్టర్‌లో నిందను కూడా తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్‌కు రాజధాని భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై ఈ నెల 30వ తేదీన ఉండవల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రైతులు తెలిపారు. రైతుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్‌కు పొలాలు ఇచ్చి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజధానిలో పరిశ్రమలు వచ్చేలా ప్రభుత్వం పనిచేయాలని కోరారు. స్థానిక వర్సిటీల్లో ఈ ప్రాంత పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలన్నారు. నేతలు కృష్ణయ్య, జొన్న శివశంకర్, రవి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పద్మారెడ్డి పాల్గొన్నారు.


